కవిత కామెంట్లకు మంత్రి కొండా సురేఖ కౌంటర్

కవిత కామెంట్లకు మంత్రి కొండా సురేఖ కౌంటర్
  • కవిత కామెంట్లకు మంత్రి కొండా సురేఖ కౌంటర్ 
  • ఆయనేమైనా మీలా లిక్కర్ స్కామ్, పేపర్లు లీక్ చేశారా? అని సెటైర్ 

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాటలు.. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయని మంత్రి కొండా సురేఖ అన్నారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడారు. టీఎస్ పీఎస్సీ చైర్మన్, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిపై కవిత చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు. ‘‘మహేందర్ రెడ్డి అవినీతి అధికారి అయితే మీ ప్రభుత్వ హయాంలో డీజీపీ పోస్టులోఎలా కూర్చోబెట్టారు. ఆయన 36 ఏండ్ల పాటు అనేక హోదాల్లో ప్రభుత్వ సేవ చేశారు. మీలా లిక్కర్ స్కామ్ చేశారా? టీఎస్​పీఎస్సీ పేపర్లు లీక్ చేశారా?” అని సెటైర్ వేశారు. పదేండ్లు తెలంగాణకు అన్యాయం చేసిందే బీఆర్ఎస్ అని మండిపడ్డారు. ‘‘బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ యువతకు న్యాయం జరగలేదు. యువత భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలపై నిర్లక్ష్యం చేశారు. పదేండ్లు పాలించి ఇలా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది” అని అన్నారు. 

ఆంధ్రా కాంట్రాక్టర్లను పెంచి పోషించిందే కల్వకుంట్ల కుటుంబమని ఫైర్ అయ్యారు. ‘‘కారుణ్య నియామకాలపై మాట్లాడే హక్కు బీఆర్ఎస్​కు లేదు. అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వాళ్లదే. సింగరేణి నిధులను మళ్లించింది ఎవరు? సింగరేణిని విధ్వంసం చేసింది ఎవరు?’’ అని ప్రశ్నించారు. ఈసారి ప్రెస్ మీట్ పెట్టే ముందు గత మీ పాలనను గుర్తుచేసుకుని మాట్లాడాలని కవితకు చురకలు అంటించారు. అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా కాలేదని,  అప్పుడే ప్రభుత్వంపై నిందలు వేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై తప్పకుండా ఎంక్వైరీ ఉంటుందన్నారు.