దౌత్యవేత్తలకు మంత్రి కేటీఆర్ ప్రజెంటేషన్

దౌత్యవేత్తలకు మంత్రి కేటీఆర్ ప్రజెంటేషన్

హైదరాబాద్​, వెలుగు: తెలంగాణకు భారీగా పెట్టుబడులను రప్పించడమే లక్ష్యంగా ఐటీ, మున్సిపల్​ డెవెలప్​మెంట్​, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్​ హైదరాబాద్​లో​‘డిప్లమాట్​ ఔట్​రీచ్​ ప్రోగ్రామ్’​ సమావేశం నిర్వహించారు. సిటీలోని టీ హబ్ 2.0 లో జరిగిన ఈ సమావేశానికి 50 దేశాలకు చెందిన రాయబారులు, డిప్లమాట్స్, కాన్సుల్ జనరల్స్, గౌరవ కాన్సుల్ జనరల్స్, హై కమిషనర్లు, ట్రేడ్ కమిషనర్లు హాజరయ్యారు.

తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలు, పెట్టుబడిదారులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాలపై ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్  ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక పాలసీతో పాటు వివిధ రంగాల్లో ఉన్న ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. ప్రపంచంలోని అత్యంత ప్రముఖమైన పలు కంపెనీలకు గత 8 ఏళ్లుగా తెలంగాణ గమ్యస్థానంగా మారడం, ఆయా కంపెనీలు విజయవంతంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్న తీరును మంత్రి వివరించారు.

స్నేహపూర్వక వాతావరణం, పారదర్శకమైన  ప్రభుత్వ పాలసీలతో పాటు దేశంలోనే అత్యుత్తమ ఇకో సిస్టం తెలంగాణ సొంతమని కేటీఆర్ చెప్పారు. వ్యవసాయం, పారిశ్రామిక, సేవారంగాల్లో గత 8 ఏళ్లుగా సాధించిన ప్రగతితో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ భారీగా ఎదిగిందని కేటీఆర్ చెప్పారు.