భవన నిర్మాణ అనుమతుల కోసం అత్యంత పారదర్శకమైన, వేగవంతమైన విధానం తీసుకొస్తామని అన్నారు మంత్రి కేటీఆర్. రాష్ట్ర స్థాయి టౌన్ ప్లానింగ్ సిబ్బంది సమావేశంలో మాట్లాడిన ఆయన.. దశాబ్దాలుగా టౌన్ ప్లానింగ్ సిబ్బంది పనితీరుపై ఉన్న అనుమానాలు తొలగించేలా నూతన భవన నిర్మాణ అనుమతుల విధానాన్ని తీసుకువస్తామని చెప్పారు. పౌరుల సౌకర్యం, సంతోషమే లక్ష్యంగా నూతన పురపాలక చట్టం అమలు ఉంటుందని అన్నారు. టీఎస్ ఐపాస్ మాదిరి… నూతన భవన నిర్మాణ అనుమతులు, విధాన రూపకల్పన జరుగుతదన్నారు. సెల్ఫ్ డిక్లరేషన్, సింగిల్ విండో పద్ధతుల్లో భవన నిర్మాణ అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. నూతన విధానాన్ని ఆసరాగా చేసుకుని తప్పుడు అనుమతులు తీసుకున్నా, అక్రమ నిర్మాణాలు చేపట్టినా.. కూల్చివేతలు తప్పవని హెచ్చరించారు.
నూతన విధానాన్ని అమలు చేసే బాధ్యత టౌన్ ప్లానింగ్ సిబ్బందిదేనని కేటీఆర్ అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే టౌన్ ప్లానింగ్ సిబ్బంది పైన నూతన చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని చెప్పారు. టౌన్ ప్లానింగ్ విభాగంలోని ఖాళీల భర్తీ, ఇతర మౌలిక వసతుల కల్పనకు పురపాలక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన మంత్రి కేటీఆర్. ఈ మీటింగ్ లో కేటీఆర్ తో పాటు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, హైదరాబాద్ సిసిపి దేవేందర్ రెడ్డి, డిటిసిపి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
