- రోడ్డు దాటుతుంటే ప్రాణాలు పోతున్నాయని ఆవేదన
- ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి ఆదేశాలు
ఎల్బీనగర్, వెలుగు: ఆర్అండ్బీ, హైవే అథారిటీ, మెట్రో శాఖల మధ్య సమన్వయ లోపంతో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మాణానికి నోచుకోక హయత్ నగర్, మన్సూరాబాద్ డివిజన్లలోని వందల కాలనీల వాసులు ప్రాణాలు కోల్పోతున్నామని హయత్ నగర్లో మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో కాలనీ వాసులు విజయవాడ హైవేపై ఆందోళనకు దిగారు. వచ్చిపోయే వాహనాలను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. ఆర్అండ్ బీ, జీహెచ్‌ఎంసీ, ఫారెస్ట్, మెట్రో అధికారుల నిర్లక్ష్యంతో తాము రోడ్డు దాటుతూ ప్రమాదాల బారిన పడుతున్నామన్నారు.
ప్రమాదాల్లో కొందరు ప్రాణాలు కోల్పోతుంటే మరికొందరు వికలాంగులవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. రోడ్డుకు ఇరువైపులా పెట్టిన గ్రిల్స్ ద్వారా రోడ్డు దాటే పరిస్థితి లేదని, తప్పనిసరి పరిస్థితుల్లో గ్రిల్స్ పైనుంచి వెళ్లాల్సి వస్తుందని, ఓవర్ స్పీడ్ వాహనాలు ఢీకొని ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున కాలనీ వాసులు రోడ్డుపైకి రావడంతో ట్రాఫిక్ స్థంభించింది. ఆ తర్వాత పోలీసులు సర్దిచెప్పిఆందోళన పంపించారు.
మూడు నెలల్లో పూర్తిచేయండి
ఈ ఘటనపై రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు.హైదరాబాద్ - -విజయవాడ జాతీయ రహదారిపై హయత్నగర్ సమీపంలో ప్రమాదాల నివారణకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. భాగ్యలత, లెక్చరర్స్ కాలనీ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను మూడు నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు విస్తరణ పనులకు ఆస్తి యజమానులు అడ్డుపడుతూ కోర్టు ఉత్తర్వులు తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు ముఖ్యమని, అవసరమైతే పోలీసు బందోబస్తుతో పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. - - – మంత్రి కోమటిరెడ్డి
