హైదరాబాద్‌కు ధీటుగా వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (UGD) పనులను పూర్తి చేయడంతో పాటు.. రాబోయే కొద్దిరోజుల్లోనే మామునూరు ఎయిర్ పోర్ట్ పనులకు శంకుస్థాపన చేయబోతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటన చేశారు.
రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సొంతింటి కలను నిజం చేయడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. పేదవాడి ఆత్మగౌరవ ప్రతీకగా ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోందని ఆయన తెలిపారు. వరంగల్ జిల్లాలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా సాగుతోందని.. రాబోయే రోజుల్లో మరో రెండు లక్షల ఇళ్లను పేదలకు అందిస్తామని మంత్రి ప్రకటించారు.గత ప్రభుత్వం కట్టిన ఇళ్లను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేస్తోందంటూ కొందరు చేస్తున్న ఆరోపణలపై మంత్రి పొంగులేటి "మేము కట్టిన వాటినే పంపిణీ చేస్తున్నామని మాట్లాడుతున్న వాళ్లు.. మరి పదేళ్ల అధికారంలో వాటిని ఎందుకు పూర్తి చేయలేకపోయారు? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన ఇళ్లను తమ ప్రభుత్వమే పూర్తి చేసి, అర్హులైన పేదలకు పంపిణీ చేస్తోందని ఆయన స్పష్టం చేశారు.
గత పదేళ్ల పాలనలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తమ సొంత నియోజకవర్గాలకే ఇళ్లను పరిమితం చేశారని.. పేదల కష్టాలను గుర్తించకుండా కేవలం నటించారని మండిపడ్డారు. కానీ, తమ కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష లేకుండా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఇళ్లను మంజూరు చేసిందని గుర్తుచేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మరో 20 వేల మంది వరకు ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారని మంత్రి తెలిపారు. హైదరాబాద్ తరహాలోనే గ్రేటర్ వరంగల్ పరిధిలో కూడా ప్రభుత్వ స్థలాలను తక్షణమే గుర్తించాలని కలెక్టర్లను ఆదేశించినట్లు చెప్పారు.
