ప్రభుత్వ శాఖల భూ తగాదాలు పరిష్కరిస్తాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ప్రభుత్వ శాఖల భూ తగాదాలు పరిష్కరిస్తాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

చిలప్ చెడ్/కౌడిపల్లి, వెలుగు: రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేట్, ఫారెస్ట్, - రెవెన్యూ, ఎండోమెంట్  భూములకు సంబంధించి వివాదాలు ఉన్న మాట వాస్తవమని, అలాంటి  భూములను సర్వే చేసి వివాదాలను శాశ్వతంగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. శనివారం మెదక్  జిల్లా చిలప్ చెడ్  మండలం శిలంపల్లి రైతు వేదికలో ఏర్పాటు చేసిన భూ భారతి అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణిలో లోపాల కారణంగా రైతులు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. 

దేశంలోని 18 రాష్ట్రాల్లో అమలులో ఉన్న రెవెన్యూ చట్టాలను పరిశీలించి, తయారు చేసిన చట్టమే భూభారతి అని తెలిపారు. ఎక్కువ భూములకు బౌండరీ  మ్యాప్  లేకపోవడంతో సమస్యలు వస్తున్నాయని చెప్పారు. సర్వే చేసి మ్యాప్​లు ఇచ్చి, వాటిని పాస్ బుక్ లో అప్​లోడ్  చేస్తే భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అవుతాయన్నారు. రిజిస్ట్రేషన్  సమయంలోనే భూములు సర్వే చేయించి, సర్వే మ్యాప్  కూడా రిజిస్ట్రేషన్ తో పాటు పాస్ బుక్, లైనర్  డాక్యుమెంట్​లో అప్​లోడ్  చేసేలా చూస్తామని చెప్పారు. రాష్ట్రంలో 6 వేల మంది లైసెన్స్​డ్  సర్వేయర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. 

జూన్  2 నుంచి సర్వేయర్లను, రెవెన్యూ అధికారులను నియమిస్తామని చెప్పారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి తహసీల్దార్​ స్థాయి అధికారుల టీం వస్తుందని, రైతుల భూ సమస్యలను  గ్రామంలోని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. భూభారతి అమలులో అధికారులు నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు, నర్సాపూర్  ఎమ్మెల్యే సునీతారెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి పాల్గొన్నారు.