ప్రజల మన్ననలు పొందేలా పని చేయాలి : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

ప్రజల మన్ననలు పొందేలా పని చేయాలి  : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

ఖమ్మం టౌన్,వెలుగు : ప్రజల మన్ననలు పొందేలా నాయకులు పని చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. గురువారం ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో సర్పంచులు, మునిసిపల్ చైర్ పర్సన్, వార్డు కౌన్సిలర్లు, ఇతర ప్రజా ప్రతినిధులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయితో కలిసి   చేసి ప్రారంభించారు.

మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక  99 రోజుల కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, పంచాయతీ రాజ్ డిప్యూటీ కమిషనర్, జిల్లా ప్రత్యేక అధికారి  విద్యాలత, జడ్పీ సీఈఓ దీక్షా రైనా, డీపీఓ రాంబాబు పాల్గొన్నారు. 

పేదలు ఆత్మగౌరవంతో జీవించేలా చర్యలు

కూసుమంచి : -పేదలు ఆత్మ గౌరవంతో జీవించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. గురువారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తో కలిసి కూసుమంచి మండలంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. పాలేరు గ్రామంలో మంత్రి పర్యటించి రూ.5 కోట్లతో పాలేరు సరస్సు వద్ద చేపట్టనున్న పర్యాటక సౌకర్యాల అభివృద్ధి పనులకు, మల్లాయి గూడెం గ్రామంలో మల్లాయిగూడెం నుంచి ఆంజనేయస్వామి దేవాలయం వరకు రూ.135 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు, గట్టుసింగారం గ్రామంలో నూతనంగా నిర్మించనున్న విద్యుత్ నియంత్రికల మరమ్మతుల కేంద్రం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

అర్హులైన పేదలందరికీ విడతల వారీగా ఇందిరమ్మ ఇండ్లను తప్పనిసరిగా మంజూరు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గ పరిధిలో సుమారు 200 కుట్టుమిషన్లు పంపిణీ చేస్తున్నామని అన్నారు. మైనారిటీ సోదరీమణులు కుట్టు మిషన్లతో వారి నైపుణ్యాన్ని ఉపయోగించి ఆర్థికంగా ఎదగాలని అన్నారు. పాలేరు నియోజకవర్గానికి చెందిన 163 మంది ముస్లిం మైనారిటీ మహిళా లబ్ధిదారులకు కుట్టు మిషన్లను, కూసుమంచి మండల మజీద్​ కమిటీలకు 350 రంజాన్ గిఫ్ట్ పాకెట్స్ లను మంత్రి పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాలేరు నియోజక వర్గ ప్రత్యేక అధికారి రమేష్, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ముజాహిద్, ఖమ్మం ఆర్డీఓ శ్రీనివాస్ పాల్గొన్నారు.