ఏఐ సమిట్ కు ప్రతిపక్షాలను పిలవరా?: కేంద్రం తీరుపై మంత్రి పొన్నం ఆగ్రహం

ఏఐ సమిట్ కు ప్రతిపక్షాలను పిలవరా?: కేంద్రం తీరుపై మంత్రి పొన్నం ఆగ్రహం

హుస్నాబాద్, వెలుగు: ఢిల్లీలో నిర్వహించిన ‘భారత్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’ విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా మండిపడ్డారు. శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఏఐ సమ్మిట్ అనేది ఏ ఒక్క పార్టీకి చెందినది కాదని, దేశ గౌరవానికి సంబంధించిన అంతర్జాతీయ వేదిక అని పేర్కొన్నారు. భారత్ అంటే కేవలం ప్రధాని నరేంద్ర మోదీ ఒక్కరే కాదని, ఇలాంటి కార్యక్రమాలకు ప్రతిపక్ష నేతలను కూడా ఆహ్వానించి గౌరవించడం కేంద్ర బాధ్యత అన్నారు. రాష్ట్రంలో నిర్వహించిన ‘విజన్ 2047’ సమ్మిట్‌‌లో రాజకీయాలకు తావులేకుండా వ్యవహరించామని గుర్తు చేశారు. 

ఆ కార్యక్రమానికి బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌‌తో పాటు ప్రతిపక్ష నేత కేసీఆర్‌‌ను కూడా ఆహ్వానించి సముచిత గౌరవం ఇచ్చామని తెలిపారు. దేశాభివృద్ధికి రాష్ట్రాల ఐక్యత అవసరమని, అయితే కేంద్రం ప్రతీ విషయంలో వివక్ష చూపుతోందని ఆరోపించారు. రిపబ్లిక్ డే వేడుకల్లో రాహుల్ గాంధీని మూడో వరుసలో కూర్చోబెట్టడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. 

గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలకు మొదటి వరుసలో సీట్లు ఇచ్చి గౌరవించిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా కేంద్రం తన వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు.