బోరబండ, రహమత్ నగర్ వాసుల నీటి కష్టాలకు చెక్.. రిజర్వాయర్ పనులు ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్..

బోరబండ, రహమత్ నగర్ వాసుల నీటి కష్టాలకు చెక్.. రిజర్వాయర్ పనులు ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్..

హైదరాబాద్ లో జనాభా రోజురోజుకీ పెరుగుతూనే ఉంది.. జనాభా పెరిగేకొద్దీ ప్రజలకు నీటి కష్టాలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండ, రహమత్ నగర్ లాంటి ప్రాంతాల్లో నీటి కష్టాలతో జనం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ డివిజన్లలో సుమారు 18 వేల కుటుంబాలు మూడురోజులకు ఒకసారి .. అర్థరాత్రి వచ్చే నీళ్లతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో రహమత్ నగర్, బోరబండ ప్రాంతాల ప్రజల నీటి కష్టాలకు చెక్ చెప్పే దిశగా అడుగులు ముమ్మరం చేసింది ప్రభుత్వం. రూ. 5. 75 కోట్లతో రిజర్వాయర్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. ఈ మేరకు రిజర్వాయర్ పనులను ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. 

ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి పొన్నం..  హైదరాబాద్ అభివృద్ధిపై రాజకీయాలకు అతీతంగా తాగు నీటి సమస్య పరిష్కారం చేయడానికి ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. 2015 లో 8 లక్షల నల్లా కనెక్షన్స్ ఉంటే గత 10 సంవత్సరాల్లో 13.80 లక్షల కనెక్షన్లు పెరిగాయని.. గత 10 సంవత్సరాలుగా కొత్త లైన్ వేయకపోవడంతో హైదరాబాద్ ప్రజలు నీటి కొరత తో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 7 వేల 400 కోట్లతో 20 టీఎంసీల నీటిని నగరానికి తీసుకొచ్చే టెండర్ల ప్రక్రియ పూర్తయిందని..  త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయని అన్నారు పొన్నం. 

మూసి క్లీనింగ్ రూ. 3వేల 800 కోట్లతో 39 STP లు త్వరలోనే ప్రారంభం కానున్నాయని అన్నారు. ఓల్డ్ సిటీ లో 301 కోట్లతో సివరేజ్ పనులు ప్రారంభించామని.. రాబోయే కాలంలో నగరం పెరుగుతున్న దృష్ట్యా  తాగునీటి సమస్య పరిష్కారం చేయడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం తరుపున గతంలో కోరామని అన్నారు. నగర తాగు నీటికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలని.. హైదరాబాద్ ఇంచార్జి మంత్రిగా విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. 

రహమత్ నగర్ బోరబండ ప్రజలు చాలా కాలంగా ఎదుర్కుంటున్న సమస్య కి చెక్ పడిందని.. పీజేఆర్ చిరకాల కల నెరవేరిందని అన్నారు. గృహ నిర్మాణం,హైదరాబాద్ సమస్యలు అందరం కలిసి పరిష్కరిస్తామని అన్నారు మంత్రి పొన్నం.