- కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు
- మంత్రి పొన్నం బహిరంగ లేఖ
హుస్నాబాద్/అక్కన్నపేట, వెలుగు: తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న మొండి వైఖరిపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్కు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల విషయంలో కేంద్ర మంత్రులు ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ‘పక్కనే ఉన్న ఏపీకి భారీగా నిధులు ఇస్తున్నారు. దానిని మేం తప్పుబట్టడం లేదు. కానీ, తెలంగాణకు ఇచ్చే విషయంలో ఎందుకు వివక్ష చూపుతున్నారు’. అని పొన్నం ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజలు చెల్లిస్తున్న పన్నులే కేంద్రానికి ప్రధాన ఆదాయ వనరులని, తిరిగి రాష్ట్రానికి నిధులు ఇవ్వడంలో ఎందుకు అన్యాయం చేస్తున్నారని నిలదీశారు. మోదీ పాలనలో ఫెడరల్ స్ఫూర్తి ఖూనీ అవుతోందని ధ్వజమెత్తారు. 12 ఏళ్లు గడిచినా బయ్యారం స్టీల్ ప్లాంట్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు పూర్తి చేయలేదన్నారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు 50 శాతం నిధులు ఇస్తారా? లేదా? ఐటీఐఆర్ ప్రాజెక్టును ఎందుకు తొక్కిపెట్టారు? ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగానికి అనుమతులు ఇవ్వడంలో కేంద్రం ఎందుకు ఆలస్యం చేస్తోందని నిలదీశారు. కేంద్ర ప్రాయోజిత పథకాల్లో కేంద్రం తన వాటాను తగ్గించుకోవడం అన్యాయమని, వెంటనే 90 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు.
