భీమదేవరపల్లి, వెలుగు: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో వరుణయాగం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి 108 కలశాలతో అభిషేకం చేశారు. మంగళవారం రాత్రి కొత్తకొండలో బస చేసిన మంత్రి, బుధవారం ఉదయం నాయకులు, కార్యకర్తలతో కలిసి మార్నింగ్ వాక్ నిర్వహించి గ్రామ ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు. గ్రామ అభివృద్ధికి సంబంధించిన వినతులను స్వీకరించి, ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందని తెలిపారు.
అనంతరం మాట్లాడుతూ కాకతీయుల కాలం నాటి ఈ ఆలయం మహిమాన్వితమైన క్షేత్రమని పేర్కొన్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా దేవాలయాల్లో వరుణయాగాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు పోచంపల్లి రాజిరెడ్డి, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.
