పద్మారావునగర్, వెలుగు: భూగర్భ జలాల పెంపు కోసం బోయిగూడలోని ఎంఎన్కే అపార్ట్మెంట్ వాసులు తీసుకున్న చొరవను మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. అపార్ట్మెంట్ ప్రాంగణంలో ఏకంగా 27 ఇంకుడు గుంతలు నిర్మించి వర్షపు నీటిని భూమిలోకి మళ్లించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
ఇందుకు సంబంధించి ఆదివారం ‘వెలుగు’ పేపర్లో వచ్చిన స్టోరీపై ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ ఆదర్శవంతమైన ప్రయత్నాన్ని స్వయంగా చూడాలని నిర్ణయించుకున్న మంత్రి.. ఈ నెల 28న మంగళవారం ఉదయం 8 గంటలకు అపార్ట్మెంట్కు రానున్నట్లు సమాచారం అందిందని అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ జి. హనుమాన్లు తెలిపారు.

