
- ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి పొన్నం
హైదరాబాద్, వెలుగు: మహిళల ఫ్రీ బస్సు జర్నీకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి పెద్ద మొత్తంలో కొత్త బస్సులను ఇచ్చిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్లోని పంజాగుట్ట నుంచి లక్డీకపూల్ వరకు మంత్రి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. బస్సులో ఉన్న మహిళలతో ముచ్చటించారు. వారికి ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
తమ సర్కార్ మహిళల సంక్షేమం కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని మంత్రి పొన్నం చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతోపాటు వారిని కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతోనే మహిళా సంఘాలకు బస్సులను ఇస్తున్నామని చెప్పారు. ఉచిత ప్రయాణం పట్ల మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. దీంతో తమ నెలవారీ డబ్బులు ఆదా అవుతున్నాయని పలువురు మహిళలు మంత్రికి చెప్పారు. మంత్రి పొన్నం వెంట ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మేయర్ విజయలక్ష్మి ఉన్నారు.