
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఇందిరా క్యాంటీన్లలోరూ.5 కే బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌ను సోమవారం మోతీ నగర్, మింట్ కాంపౌండ్ హైదరాబాద్ జిల్లా ఇన్చార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి ప్రారంభించనున్నారు. మొత్తం 150కేంద్రాలకుగాను మొదటి దశలో 60 కేంద్రాల్లో రూ.5 బ్రేక్ ఫాస్ట్ ని అందుబాటులోకి తీనున్నారు. ఆ తర్వాత నగర వ్యాప్తంగా 150 ఇందిరమ్మ క్యాంటీన్ల లో బ్రేక్ ఫాస్ట్ ని జీహెచ్ఎంసీ అందించనుంది. డైలీ 25 వేల మందికి మిల్లెట్ టిఫిన్స్ ని ఈ కేంద్రాల ద్వారా అందించనున్నారు. మెనూలో ఇడ్లీ, ఉప్మా, మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ ఉప్మా, పూరితో పాటు పొంగల్ అందించనున్నారు. ఒక్కో ప్లేట్ కు రూ.19 ఖర్చు అవుతుండగా ఇందులో రూ.14 జీహెచ్ఎంసీ భరిస్తుంది. ఇందిరమ్మ క్యాంటీన్లలో టిఫిన్, భోజనాలు అందించేందుకు హరికృష్ణా ఫౌండేషన్‌తో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే టిఫిన్స్ ఏర్పాటు చేయడానికి ఏడాదికి రూ.10కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు చెబుతున్నారు. క్యాంటీన్లకు ఆదివారం రోజు సెలవు ఉండనుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే
నగరంలోని చిరు వ్యాపారులు, అడ్డా కూలీలు, నగరానికి వివిధ పనులపై వచ్చే వారికి తక్కువ ధరలో భోజనం అందుబాటులో ఉండేలా 2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5కే భోజన పథకాన్నిమొదటగా నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద ప్రారంభించింది. రైల్వే స్టేషన్లు, ఆస్పత్రులు, అడ్డాకూలీలు ఉండే ప్రాంతాల్లో కూడా వీటిని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం నగరంలో 150 కేంద్రాల్లో డైలీ సుమారు 30వేల మంది భోజనం చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 12కోట్ల మందికి భోజనం అందించారు. 150 కేంద్రాలకుగాను ప్రస్తుతం 128 కేంద్రాల్లో మాత్రమే భోజనం అందిస్తున్నారు. మిగిలిన కేంద్రాల్లో మరమత్తుల కారణంగా తాత్కాలికంగా నిలిపేశారు.