హైదరాబాద్: సమస్యకు సమ్మె పరిష్కారం కాదని.. సమ్మె విరమించి విధుల్లో చేరాలని ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. 2026, ఏప్రిల్ 22 అర్థరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సమ్మె విరమించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ పరిరక్షణ, ప్రజా శ్రేయస్సు కోసం సమ్మె విరమించాలని కోరారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఉన్నతాధికారులతో కమిటీ వేశామని.. 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించామని తెలిపారు.
కమిటీల పేరుతో కాలయాపన చేస్తామనడం పొరపాటని అన్నారు. కార్మికులు లేవనెత్తిన 32 అంశాల్లో 29 అంశాలపై సానుకూలంగా ఉన్నాయని.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికల అంశం మాత్రమే పెండింగ్లో ఉందని చెప్పారు. ఉద్యోగులకు ప్రతి నెలా ఫస్ట్ తేదీనే జీతాలు చెల్లిస్తున్నామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టిందని తెలిపారు. అధికారంలోకి రాగానే పెండింగ్లో ఉన్న 2017 పీఆర్సీ క్లియర్ చేశాం. డీఏలు పెండింగ్ లేకుండా చెల్లించాం.
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ జేఏసీ నేతలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు విఫలం కావడంతో తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. బుధవారం (ఏప్రిల్ 23) అర్థరాత్రి ఆర్టీసీ కార్మికుల సమ్మె మొదలైంది. సమ్మె ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా బస్సులు రోడ్డెక్కడం లేదు. అన్ని జిల్లాల్లో బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. బస్టాండ్ల దగ్గర బస్సుల కోసం పడిగాపులు కాస్తున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది.

