V6 News

డీలిమిటేషన్ ప్రక్రియలో ఫుల్ స్టాప్, కామాలుకూడా మార్చలే : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

డీలిమిటేషన్ ప్రక్రియలో ఫుల్ స్టాప్, కామాలుకూడా మార్చలే : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ హయాంలో చేసినట్లుగానే తాము డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. బిల్లులో తేదీలు తప్ప ఫుల్ స్టాపులు, కామాలు కూడా ముట్టుకోలేదని క్లారిటీ ఇచ్చారు. డీలిమిటేషన్ ప్రక్రియను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లులో సీట్లు పెంచుతామని ఎలా చెప్పిందని ప్రశ్నించారు.

ఆదివారం ఢిల్లీలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ నివాసంలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. డీలిమిటేషన్‌ పై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ.. తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ పై అసత్య ప్రచారాలు జరుగుతున్నాయన్నారు.

తెలంగాణకు మంజూరు చేసిన 2,500 ఈవీ బస్సుల విషయంలో సీఎం తన అపాయిట్మెంట్ కోరినట్లు చెప్పారు. అయితే.. తన ఇంట్లో ఏర్పాటు చేసిన బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ కు కేంద్ర మంత్రి కుమార స్వామి కూడా వస్తున్నందున.. తమ ఇంటికే రావాలని సీఎంను కోరామన్నారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి, కుమార స్వామితో పాటు తనను కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరపున విజ్ఞప్తులను అందజేశారని వెల్లడించారు. అయితే, దీనిపై కొందరు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.