వర్షాలపై అధికారులు అలర్ట్ గా ఉండాలి 

వర్షాలపై అధికారులు అలర్ట్ గా ఉండాలి 

ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు మంత్రి సత్యవతి రాథోడ్. మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి  జిల్లాల కలెక్టర్, ఎస్పీ, ఇరిగేషన్ అధికారులతో వర్షాలు, వరదలపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 

గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా వరద ఉదృతి పెరుగుతోన్న క్రమంలో అధికారులు అలర్ట్ గా ఉండాలని సూచించారు. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజా ప్రతినిధులు ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. 

రాగల 48 గంటల్లో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున.. ములుగు, భూపాలపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. మహబూబాబాద్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేశారు. వర్షాల కారణంగా జరిగే ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి. అంతేకాదు..జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి 24 గంటలు అవి పనిచేసేలా పర్యవేక్షించాలన్నారు. లోతట్లు ప్రాంతాలను ముందే గుర్తించి, అక్కడి ప్రజల భద్రతకు కావల్సిన చర్యలు వెంటనే చేపట్టాలన్నారు. ముంపు ప్రాంతాల్లో ఉన్న జనాలను అక్కడి నుంచి తరలించి.. పునరావాస ఏర్పాటు చేయాలన్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాలువలు, చెరువులు, కుంటలల్లో  బలహీనంగా ఉన్న ఆనకట్టలు గుర్తించి వాటిని పటిష్టం చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు..అంతేకాదు శిథిలావస్థలో ఉన్న ఇళ్లను ఖాళీ చేయించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని  అధికారులను కోరారు మంత్రి సత్యవతి రాథోడ్ .