కలెక్టర్లతో KCR కాళ్లు మొక్కించుకున్నప్పుడు ఆత్మగౌరవం గుర్తుకు రాలే..? సీతక్క ఫైర్

కలెక్టర్లతో KCR కాళ్లు మొక్కించుకున్నప్పుడు ఆత్మగౌరవం గుర్తుకు రాలే..? సీతక్క ఫైర్

హైదరాబాద్: తెలంగాణ ఆడబిడ్డలతో సుందరీమణుల కాళ్ళు కడిగించి రాష్ట్ర మహిళల ఆత్మగౌరవానికి ప్రభుత్వం అవమానం కల్గించిందని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ చేస్తోన్న విమర్శలకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. గురువారం (మే 15) ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ములుగు జిల్లాలో హెరిటేజ్ వాక్ సక్సస్ కావడంతో బీఆర్ఎస్ నేతలు కళ్లలో నిప్పులు పోసుకున్నారని.. కోడి గుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గిరిజన సంప్రదాయంలో గుళ్లలోకి కాళ్ళు కడుగుకొని వెళ్తారు.

గిరిజన సంప్రదాయం ప్రకారం మిస్ వరల్డ్ పోటీదారులు కూడా కాళ్లు కడుక్కుని రామప్ప ఆలయంలోకి వెళ్లారు. అందులో ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ అమ్మాయి మిస్ వరల్డ్ పోటీదారు కాళ్లకు నీళ్ళు పోసింది. దానిని పట్టుకొని ప్రభుత్వం తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని బద్నాం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తోందని.. చిన్న విషయాన్ని కూడా రాష్ట్ర సెంటిమెంట్‎కి ముడిపెడుతోందని ధ్వజమెత్తారు. 

బీఆర్ఎస్ నేతలు నిస్సిగ్గుగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారనన్న సీతక్క.. తెలంగాణ ప్రభుత్వం మిస్ వరల్డ్ పోటీదారుల కాళ్లు కడిగిస్తే.. అందరి కాళ్లు కడిగించాలి కదా..? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇవాంక ట్రంప్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఆమె తోక పట్టుకొని తిరిగిన కేసీఆర్.. ఎలాంటి సంస్కృతి సంప్రదాయాలు పాటించారో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. కవితమ్మ కాళ్ళ దగ్గర కలెక్టర్‎ను కూర్చోబెట్టినప్పుడు.. కేసీఆర్ కలెక్టర్లతో కాళ్ళు మొక్కించుకోవడం మీ దురహంకారం కాదా..? మీ దురహంకారానికి వ్యతిరేకంగానే కదా ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టారని అన్నారు. 

తెలంగాణ పేరునే మీ పార్టీ పేరులో నుంచి తీశారు.. అలాంటి మీకు తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడే అర్హత ఉందా అని ప్రశ్నించారు. ఈమధ్య సబితా ఇంద్రారెడ్డి ములుగు మీద పచ్చి అబద్ధాలు చెబుతున్నారని.. ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఏం మానవత్వం చూపిందో తెలుసన్నారు. వాస్తవాలు మాట్లాడు.. అబద్ధాలు కాదని సబితా ఇంద్రారెడ్డికి చురకలంటించారు. ఇప్పటికైనా అబద్ధాలకు అంబాసిడర్‎గా మారకని సబితాను ఎద్దేవా చేశారు. అధికారం పోయాక ప్రజలు, ఆత్మగౌరవం గుర్తుకు మీకు వచ్చిందా..? అని బీఆర్ఎస్ నేతలను కడిగిపారేశారు మంత్రి సీతక్క.