కేటీఆర్.. దొర అహంకారం తగ్గించుకో.. నీలాగా నాకు ధన, కుల బలం లేదు: మంత్రి సీతక్క

కేటీఆర్.. దొర అహంకారం తగ్గించుకో.. నీలాగా నాకు  ధన, కుల బలం లేదు: మంత్రి సీతక్క
  • నియోజకవర్గ ప్రజల అండ మాత్రమే ఉన్నది
  • నువ్వు మనిషివే అయితే ములుగులో ఏం జరిగిందో తెలుసుకొని మాట్లాడు
  • ట్విట్టర్​లో అబద్ధాలు ఆడుడు బంజెయ్​
  • ఓ ఆదివాసీ మంత్రి అయ్యిందని జీర్ణించుకోలేకపోతున్నవా?​  
  • అభివృద్ధిని చూసి ఓర్వలేక మిడతల దండులా వచ్చి డ్రామాలు చేస్తారా? అని ఫైర్

ములుగు, వెలుగు: ములుగు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్​నాయకులు తనపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. కేటీఆర్ తనను టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడని అన్నారు. పదేండ్లు అధికారంలో ఉండి ఎంతోమంది ఆత్మహత్యలకు కారణమైనవారు.. తనపై కక్ష సాధింపు చర్యలకు దిగడం సరికాదని తెలిపారు. మంగళవారం ములుగులోని ఆర్​అండ్​బీ గెస్ట్ హౌస్​ లో  మంత్రి సీతక్క  మీడియాతో  మాట్లాడారు.  ములుగు నియోజకవర్గంలో ఎలాంటి నిర్బంధం లేదని, ఇందిరమ్మ పాలన కొనసాగుతున్నదని చెప్పారు. తనపై అసత్య ప్రచారాలు చేయిస్తున్నాడంటూ కేటీఆర్​పై విరుచుకుపడ్డారు. ‘‘కేటీఆర్.. నాతో పెట్టుకుంటే సర్వనాశనం అయితవ్.  నీలాగా నాకు  ధన, కుల బలం లేదు.  నియోజకవర్గ ప్రజల అండ మాత్రం ఉంది. దొర అహంకారం తగ్గించుకో. దుబాయ్​ వేదికగా సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేయడం బంజెయ్. ఆదివాసీ బిడ్డ మంత్రి అయితే జీర్ణించుకోలేకపోతున్నవ్​.. నువ్వు మనిషివే అయితే ములుగులో ఏం జరిగిందో  తెలుసుకొని మాట్లాడు” అని ఫైర్​ అయ్యారు. 

ములుగుపై కేటీఆర్ మిడతల దండు.. 
ములుగు నియోజకవర్గంపై బీఆర్ఎస్​ నేతలు  మిడతల దండులా  వచ్చి డ్రామాలు చేశారని, ఓడిపోయిన పక్క నియోజకవర్గ నాయకులకు ఇక్కడ ఏం పని అని మంత్రి సీతక్క ప్రశ్నించారు. మృతుల కుటుంబాలను పరామర్శించని వాళ్లు కూడా..  రోడ్లమీదకొచ్చి  శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని మండిపడ్డారు.  శాంతియుత నిరసనకు అవకాశం ఇచ్చినా.. రైతులకు పరిహారం ఇచ్చేందుకు వెళ్తున్న మంత్రులను అడ్డుకోవాలని చూశారన్నారు.  బుట్టాయిగూడెం, చల్వాయిలో మరణాలకు కారణాలు తెలుసుకోవాలని హితవు పిలికారు. సిరిసిల్లలో ఇసుక లారీలతో ప్రజల్ని తొక్కించి చంపింది.. అడ్వకేట్లను హత్య చేసింది ఎవరని  ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా తనకు  వస్తున్న ఆదరణ, అభిమానం చూసి ఓర్వలేకనే అక్కసు వెళ్లగక్కుతున్నారని ఫైర్​ అయ్యారు. ఎన్నికల కోసమే బీఆర్ఎస్​ నాయకులు డ్రామాలు ఆడుతున్నారని అన్నారు.

రాజకీయాల కోసం ప్రజలను ఆత్మహత్యలకు ప్రోత్సహిస్తారా? అని కేటీఆర్​ను  ప్రశ్నించారు.  పంచాయతీరాజ్ శాఖకు ఒక కోయ ఆడబిడ్డ మంత్రిగా ఉంటే అక్కసు వెళ్లగక్కుతున్నారని అన్నారు.  తనపై పోటీ చేసిన ప్రతిపక్ష నాయకురాలిని  తానే సర్పంచ్‌‌‌‌‌‌‌‌ను చేశానని గుర్తుచేశారు.  ములుగు నియోజకవర్గంలో 6 వేల మందికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని,  గత పదేండ్లలో బీఆర్ఎస్​ ఎన్ని ఇండ్లు ఇచ్చిందో చెప్పాలని సవాల్​ చేశారు. గత పాలకులు తమ కార్యకర్తలపై  అక్రమ కేసులు బనాయించారని, తాము మాత్రం కక్షసాధింపులకు పోకుండా పాలన చేస్తున్నామని చెప్పారు.   జిల్లా పోలీసుల్లో  90శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారని, వారి ఆత్మస్థైర్యం దెబ్బతినేలా కేటీఆర్​ మాట్లాడటం సరికాదన్నారు. సీఎంమీద కూడా  ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మండిపడ్డారు.