రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో చలివేంద్రాలు.. మంత్రి సీతక్క ఆదేశాలు

రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో చలివేంద్రాలు.. మంత్రి సీతక్క ఆదేశాలు

హైద‌‌రాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆ శాఖ కమిషనర్ దివ్యా దేవరాజన్‌‌తో మాట్లాడిన మంత్రి అన్ని పంచాయతీలు, మండల కేంద్రాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణించేవారు, పనుల నిమిత్తం బయటకు వెళ్లే ప్రజలకు తాగునీటి సౌకర్యం క‌‌ల్పించేందుకు చ‌‌ర్యలు చేప‌‌ట్టాల‌‌ని సూచించారు.

వేసవి కాలంలో సాధారణ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రతి గ్రామంలో, రద్దీగా ఉండే ప్రదేశాల్లో, బస్ స్టాండ్‌‌లు, మార్కెట్ ప్రాంతాలు, ప్రధాన రహదారుల వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రయాణ సమయంలో అలసటకు గురయ్యేవారికి, కూలీలు, రైతులు, రోజువారీ పనుల కోసం వెళ్లే ప్రజలకు ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. ఇప్పటికే ములుగు నియోజకవర్గవ్యాప్తంగా దాదాపు అన్ని గ్రామాల్లో చలివేంద్రాల ఏర్పాటు పూర్తి కాగా.. ప్రజలు ఈ సౌకర్యాన్ని విస్తృతంగా వినియోగించుకుంటున్నారు. స్థానిక ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మంత్రి సీతక్క కోరారు.