పేదల సంక్షేమమే ప్రజాప్రభుత్వ ధ్యేయం

పేదల సంక్షేమమే ప్రజాప్రభుత్వ ధ్యేయం
  • త్వరలో అంగన్​వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​
  • భద్రాద్రికొత్తగూడెం, ములుగు జిల్లాల్లో పర్యటించిన మంత్రి సీతక్క 

భద్రాద్రికొత్తగూడెం/ ములుగు/ తాడ్వాయి/ భద్రాచలం,/ వెంకటాపురం,  వెలుగు: పేదల సంక్షేమమే ప్రజాప్రభుత్వ ధ్యేయమని, అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని పంచాయతీరాజ్​శాఖ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం భద్రాద్రికొత్తగూడెం, ములుగు జిల్లాల్లో ఆమె పర్యటించారు. భద్రాద్రికొత్తగూడెం కలెక్టరేట్​లో ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ, కలెక్టర్ అంకిత్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్​ పి.వీరబాబు, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్​ సిరిపురపు లలిత కుమారితో కలిసి అంగన్​వాడీ టీచర్లకు స్మార్ట్​ఫోన్లను పంపిణీ చేశారు.

పోషణ్​ పక్వాడ కార్యక్రమాన్ని ప్రారంభించి, ఆడపిల్లల తల్లులకు హిమాలయ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఓపెన్​ టెండర్​ విధానంలో పారదర్శకంగా స్మార్ట్ ఫోన్లు కొనుగోళ్లు చేసి, అంగన్​వాడీ టీచర్లకు అందజేస్తున్నట్లు చెప్పారు. కొందరు కావాలనే సెల్​ఫోన్ల విషయంతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ఆయా ప్రచారాలను నమ్మవద్దని చెప్పారు. బ్రేక్​ ఫాస్ట్ పథకాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద భద్రాద్రికొత్తగూడెం జిల్లాను సెలెక్ట్​ చేసి అమలు చేస్తున్నామన్నారు. అంగన్​వాడీ కేంద్రాల బలోపేతానికి 12వేల భవనాలను సాంక్షన్​ చేశామన్నారు.

ఖాళీగా ఉన్న15వేల అంగన్​వాడీ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. రిటైర్మెంట్​ బెనిఫిట్స్ కింద ఇప్పటి వరకు రూ.8 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం భద్రాచలం ఐటీడీఏలో జరిగిన ఆదివాసీ సాంస్కృతిక ఆత్మీయ సమ్మేళనంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఇతర ఎమ్మెల్యేలు, ఆఫీసర్లతో కలిసి పాల్గొని ఇలవేల్పుల చరిత్ర పుస్తకావిష్కరణ చేశారు. అంతకుముందు మహనీయుల ఫొటోలకు నివాళులర్పించారు.

 ములుగు జిల్లా బండారుపల్లి గిరిజన భవన్​లో హోమియోపతి దినోత్సవంలో భాగంగా యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, కలెక్టర్​ దివాకర, డీఎంహెచ్వో గోపాలరావుతో కలిసి పాల్గొన్నారు. యోగా చేస్తూ ప్రతి ఒక్కరూ యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని చెప్పారు. అనంతరం తాడ్వాయి మండలంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణితోపాటు పలువురితో కలిసి పర్యటించి సీసీ, ఆర్​అండ్​బీ రోడ్లకు శంకుస్థాపనలు చేశారు.

పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్​ఎఫ్​ చెక్కులను పంపిణీ చేశారు. అంకంపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల గృహ ప్రవేశం చేశారు. పలువురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పట్టాలను పంపిణీ చేశారు.వెంకటాపురం మండలంలో మంత్రి సీతక్క భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కలెక్టర్​ దివాకరతో కలిసి పర్యటించారు. తహసీల్దార్​ ఆఫీస్​లో ప్రజాదర్భార్​ నిర్వహించి వినతులు స్వీకరించారు.

ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆఫీసర్లకు సూచించారు. పాలెంవాగు ప్రాజెక్టు నిర్వహణపై పూర్తి వివరాలు అందజేయాలని చెప్పారు. అనంతరం ఆలుబాక పంచాయతీ ముత్తారానికి వెళ్లే కల్వర్టు పనులను, పాత్ర పురం (పాలెం) నుంచి గోదావరి నదికి వెళ్లే రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ నుంచి పోస్ట్ ఆఫీస్ వద్దకు నిర్మించిన సీసీ రోడ్డు, వెంకటాపురం – మల్లాపురం రోడ్డు కంకలవాగుపై నిర్మించిన బ్రిడ్జి ప్రారంభించారు. రాచపల్లి పంచాయతీ నోట్ల గూడెంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం చేయించి, గ్రామస్తులతో కలిసి 
భోజనం చేశారు.