- అడ్వాన్స్ డ్ మ్యానుఫ్యాక్చరింగ్, మెడికల్ డివైజెస్ తయారీకి అనుకూలం: మంత్రి శ్రీధర్బాబు
- నార్వే, ఇటలీ, నెదర్లాండ్స్ ప్రతినిధుల బృందాలతో భేటీ
హైదరాబాద్, వెలుగు: లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ మంచి ప్లేస్ అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అడ్వాన్స్ డ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో పరిశ్రమల ఏర్పాటుకు దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అత్యంత అనుకూలమన్నారు. అత్యాధునిక వైద్య పరికరాల తయారీకి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
నార్వే, ఇటలీ, నెదర్లాండ్స్ ప్రతినిధుల బృందంతో మంగళవారం సెక్రటేరియెట్లో మంత్రి వేర్వేరుగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేసేలా నార్వే పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని నార్వే రాయబారి మే ఎలిన్ స్టెనర్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని కోరారు. ఇందుకోసం ప్రత్యేకంగా ‘తెలంగాణ – నార్వే వర్కింగ్ గ్రూప్’ ఏర్పాటు చేద్దామని ఆయన ప్రతిపాదించారు.
తెలంగాణతో కలిసి పనిచేస్తం: నార్వే రాయబారి
తెలంగాణతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని నార్వే రాయబారి ఎలిన్ స్టెనర్చెప్పారు. వర్కింగ్ గ్రూప్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇండస్ట్రీ 4.0, రోబోటిక్స్, స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, క్లీన్ మొబిలిటీ, రెన్యూవబుల్ ఎనర్జీ తదితర రంగాల్లో ఇటలీ మార్గదర్శకం ‘తెలంగాణ బ్రాండ్’ ను మరింత విశ్వవ్యాప్తం చేసేందుకు దోహదపడుతుందని ఇటలీ రాయబారి ఆంటోనియో బార్టోలి నేతృత్వంలోని ప్రతినిధి బృందానికి మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. తెలంగాణను గ్లోబల్ ‘మ్యానుఫ్యాక్చరింగ్ హబ్’ గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అనుసరిస్తున్న వ్యూహాలు, పాలసీలను మంత్రి వివరించారు.

