- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్, వెలుగు: రైతులు భూసారాన్ని కాపాడేందుకు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రసాయన ఎరువులు అధికంగా వినియోగిస్తే తెలంగాణలో పంజాబ్ మాదిరిగా క్యాన్సర్‌కేసులు పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం నూజివీడు సీడ్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్ఆర్ డీలో నిర్వహించిన ప్రొఫెసర్ ఎం.ఎస్.స్వామినాథన్ 9వ అవార్డుల ప్రదానోత్సవానికి ఆయన చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. స్వామినాథన్ హరిత విప్లవం ద్వారా దేశానికి చేసిన సేవలు మరువలేనివన్నారు.
శాస్త్రవేత్తలు చేసే పరిశోధనలు ప్రయోగశాలలకే పరిమితం కాకుండా గ్రామస్థాయికి చేరేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం అవార్డు గ్రహీత డాక్టర్ సీహెచ్.శ్రీనివాసరావును మాజీ ఉప రాష్ట్రపతివెంకయ్య నాయుడుతో కలిసి అభినందించారు. కార్యక్రమంలో వ్యవసాయ రంగ నిపుణులు, శాస్త్రవేత్తలు, నూజివీడు సీడ్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.

