పత్తిపై దిగుమతి సుంకం ఎత్తివేతతో మన రైతులకు నష్టం

పత్తిపై దిగుమతి సుంకం ఎత్తివేతతో మన రైతులకు నష్టం
  • రైతుల ప్రయోజనాలను కేంద్రం తాకట్టు పెట్టింది
  • మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శ

హైదరాబాద్, వెలుగు: అమెరికా నుంచి దిగుమతి అయ్యే పత్తిపై దిగుమతి సుంకాన్ని ఎత్తివేయడం దేశీయ రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టడమేనని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతులకు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుందని మంగళవారం ఓ ప్రకటనలో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సదస్సులో రైతుల ప్రయోజనాలే ప్రథమ కర్తవ్యమని చెప్పి కొద్ది రోజుల్లోనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం శోచనీయమని విమర్శించారు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పత్తి ఉత్పత్తిదారుల్లో ఒకటి కాగా, అమెరికా ఒత్తిడికి లోనై 11 శాతం దిగుమతి సుంకాన్ని కేంద్రం ఎత్తివేయడం రైతులకు దెబ్బ అని తుమ్మల స్పష్టం చేశారు. 

ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రకటించిన ఈ మినహాయింపును డిసెంబర్  31 వరకు పొడిగించడం రైతులకు వ్యతిరేకమన్నారు. ఈ నిర్ణయంతో కాటన్  కార్పొరేషన్  ఆఫ్  ఇండియా (సీసీఐ) కి నష్టం వాటిల్లుతుందని, ప్రస్తుతం సీసీఐ ధర కాండీకి (355.6 కిలోలు) రూ.56 వేల నుంచి రూ.57 వేలు ఉండగా, దిగుమతి పత్తి ధర రూ.49 వేల నుంచి రూ.51 వేలకు పడిపోతుందని వివరించారు. తమ ప్రభుత్వం పామాయిల్ పంటపై దిగుమతి సుంకాలను పెంచి రైతులను రక్షించాలని కోరుతుండగా, పత్తిపై సుంకం ఎత్తివేయడం కేంద్రం ద్వంద్వ వైఖరిని చూపిస్తోందని తుమ్మల ఆరోపించారు. 

దేశంలో తీవ్రంగా యూరియా కొరత

దేశంలో యూరియా, ఎరువుల కొరత తీవ్రంగా ఉందని మంత్రి తుమ్మల తెలిపారు. 2024 ఆగస్టులో 86.43 లక్షల టన్నులు ఉన్న యూరియా నిల్వలు 2025 ఆగస్టులో 37.19 లక్షల టన్నులకు పడిపోయాయని, అంతర్జాతీయ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ధరలు టన్నుకు 400 డాలర్ల నుంచి 530 డాలర్లకి పెరిగాయన్నారు. రామగుండం, కాకినాడ ప్లాంట్లు నిలిచిపోవడం, కేంద్రం ముందుచూపు లేకపోవడం వల్ల రైతులకు యూరియా సరఫరా కష్టమైందన్నారు. యూరియా వాడకాన్ని తగ్గించేందుకు ఆర్గానిక్  పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించాలని ఆయన డిమాండ్  చేశారు.

మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫెడ్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ

రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం ఉదయం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని  మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫెడ్ ప్రధాన కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. కార్యాలయంలో ఉద్యోగుల హాజరును పరిశీలించిన ఆయన, సమయానికి హాజరుకాని ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.