పామాయిల్ గెలల సేకరణలో అన్యాయం జరగొద్దు : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

పామాయిల్ గెలల సేకరణలో  అన్యాయం జరగొద్దు : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
  • ఆడిట్‌‌‌‌లో అక్రమాలు తేలితే కఠిన చర్యలు  
  • ఆయిల్‌‌‌‌ఫెడ్‌‌‌‌ కార్యాలయంలో మంత్రి ఆకస్మిక తనిఖీ 

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలోని పామాయిల్​ గెలల సేకరణ కేంద్రాల్లో రైతులకు అన్యాయం జరగొద్దని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సమగ్ర ఆడిట్‌‌‌‌ నిర్వహించి, అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయిల్‌‌‌‌పామ్ సాగు విస్తరణను వేగవంతం చేయడంతో పాటు, మొక్కల సరఫరా నుంచి గెలల సేకరణ వరకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. 

సోమవారం ఆయిల్‌‌‌‌ఫెడ్‌‌‌‌ ప్రధాన కార్యాలయాన్ని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అడ్మినిస్ట్రేటివ్ విభాగానికి చెందిన కొంతమంది సిబ్బంది నిర్ణీత సమయానికి విధులకు హాజరుకాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రతి ఏడాది 2 లక్షల ఎకరాల్లో ఆయిల్‌‌‌‌పామ్‌‌‌‌ సాగు విస్తరణ లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సాధించాలన్నారు. 
నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నప్పుడు రైతులకు పంపిణీలో జాప్యం జరగకూడదని తెలిపారు. 

పెండింగ్‌‌‌‌లో ఉన్న డ్రిప్‌‌‌‌ దరఖాస్తులను వెంటనే పరిష్కరించి అర్హులైన రైతులకు సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. పనితీరు సరిగా లేని ఆయిల్‌‌‌‌పామ్‌‌‌‌ కంపెనీలకు కేటాయించిన జిల్లాలను రద్దు చేసి, సమర్థవంతమైన కంపెనీలకు అప్పగిస్తామని హెచ్చరించారు. చివరికి ఆయిల్‌‌‌‌ఫెడ్‌‌‌‌ సంస్థ అయినా పనితీరు బాగాలేకపోతే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఆయిల్‌‌‌‌ఫెడ్‌‌‌‌లో సిబ్బంది నియామకంతో పాటు హార్టికల్చర్​ శాఖలో ఖాళీలను భర్తీ చేస్తామన్నారు.