- కన్వీనర్‌గా సీనియర్ జర్నలిస్ట్ కె.రామచంద్రమూర్తి ఎన్నిక
బషీర్‌బాగ్, వెలుగు : రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య వ్యవస్థలు, రాజకీయ విలువల పరిరక్షణకు పౌర సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా ‘ఫోరం ఫర్ కానిస్టిట్యూషనల్ డెమోక్రసీ’ హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
విద్యావేత్తలు, రిటైర్డ్ అధికారులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, సామాజికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో ఏర్పాటు చేసిన ఈ వేదికకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కె.రామచంద్రమూర్తిని కన్వీనర్‌గా ఎన్నుకున్నారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వేదిక ఏర్పాటు, లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
ఈ సందర్భంగా కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ భిన్న రంగాలకు చెందిన ప్రముఖులు ఒకే వేదికపైకి రావడం దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో సాధ్యమైందన్నారు. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ మాట్లాడుతూ... ప్రజాస్వామ్యం, విశ్వవిద్యాలయాల స్వేచ్ఛ, ఎన్నికల సంఘం, న్యాయవ్యవస్థ వంటి రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పౌర సమాజం మౌనంగా ఉండటం భవిష్యత్ తరాలకు అన్యాయం చేసినట్లవుతుందని అన్నారు.
ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ జి.హరగోపాల్, రిటైర్డ్ ఐఏఎస్ ఎం.వి.రెడ్డి మాట్లాడుతూ భయం, పక్షపాతం లేకుండా సామాజిక, రాజకీయ అంశాలపై స్వేచ్ఛగా చర్చించడం, ప్రభుత్వాల విధానాలను పరిశీలించడం, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న అంశాలను ప్రశ్నించడం, ప్రజలను అప్రమత్తం చేయడమే ఫోరం ప్రధాన లక్ష్యమని తెలిపారు. సీనియర్ అడ్వకేట్ జ్యోతి కిరణ్, సామాజికవేత్త డాక్టర్ గాదె గోపాల్‌రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ విరహత్ అలీ, బత్తిని దీప్తి, తదితరులు పాల్గొన్నారు.
