అబిడ్స్, వెలుగు: మూసీ నది, దాని సహజ ప్రవాహ మార్గాలు, చెరువులను పరిరక్షించడమే హైదరాబాద్ భవిష్యత్ భద్రతకు కీలకమని ఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్(ఎఫ్‌బీహెచ్) చైర్మన్ ప్రొఫెసర్ మణికొండ వేదకుమార్ అన్నారు. 1908 మూసీ వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి సోమవారం ఉస్మానియా జనరల్ ఆసుపత్రి ప్రాంగణంలోని చారిత్రక చింతచెట్టు వద్ద ఎఫ్‌బీహెచ్ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు.
908 వరదలు హైదరాబాద్‌కు విషాదకరమైన గుణపాఠాన్ని నేర్పాయని, ప్రస్తుతం నగరం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మూసీ పరీవాహక ప్రాంతాలను పరిరక్షించడంతోపాటు సమగ్ర వర్షపు నీటి పారుదల వ్యవస్థ అవసరమని వేదకుమార్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ‘ఐ విట్‌నెస్ అకౌంట్స్ ఆన్ రివర్ మూసీ ఫ్లడ్స్ ఆఫ్ 1908’ పుస్తకాన్ని వేదకుమార్, పరాశర్ ఆవిష్కరించారు. డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ రచించిన ఈ పుస్తకంలో 1908 వరదలకు సంబంధించిన చారిత్రక ఆధారాలు, ప్రత్యక్ష సాక్షుల కథనాలను పొందుపరిచారు.
పరాశర్ ప్రదర్శించిన మూసీ వరదల లావణి నాటి విషాదాన్ని కళ్లకు కట్టినట్లు ఆవిష్కరించిందని వేదకుమార్ అన్నారు. కార్యక్రమంలో ఎఫ్‌బీహెచ్ ప్రతినిధులు, దక్కన్ హెరిటేజ్ అకాడమీ సభ్యులు, ఆర్కిటెక్ట్‌లు, అధ్యాపకులు పాల్గొన్నారు.
