- మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య
ట్యాంక్‌బండ్, వెలుగు: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అధికార కాంక్షకు సామాన్య ఓటర్లు బలి కావాలా అని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య ప్రశ్నించారు. ప్రజాస్వామ్యానికి పునాది అయిన రాజ్యాంగ ఉల్లంఘనలను బీజేపీ వెంటనే బంద్ చేయాలని కోరారు.
సోమవారం హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మాలమహానాడు ఆధ్వర్యంలో భారీ నిరసన నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు ధరించి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ పేరుతో అక్రమాలు జరుగుతున్నాయని విమర్శించారు. అర్హులైన దళితులు, బహుజనులు, పేదల ఓట్లను ప్లాన్ ప్రకారం జాబితా నుంచి తొలగిస్తున్నారని ఆరోపించారు.
కేంద్రంలోని బీజేపీ సర్కార్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ రాజ్యాంగాన్ని కాలరాస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణలో ఓట్ల తొలగింపు కుట్రలను సహించేది లేదని హెచ్చరించారు.
దళిత బహుజనుల ఓట్లను తొలగించే ప్రయత్నాలు మానుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. కార్యక్రమంలో మాల మహానాడు సోషల్ మీడియా ఇన్‌చార్జ్ గడమండ్ల రమేశ్, మాల మహానాడు లీడర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
