- పట్టుకుని పోలీసులకు అప్పగించిన సెక్యూరిటీ గార్డులు
పద్మారావునగర్, వెలుగు: ఆత్మహత్య చేసుకున్న భార్యను అనాథ శవంగా నమ్మించేందుకు ఓ వ్యక్తి స్కెచ్ వేసి దొరికిపోయాడు. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన దాసు (27), రేఖ(18) రెండు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఉపాధి నిమిత్తం నగరానికి వలస వచ్చి పేట్‌బషీరాబాద్ పరిధిలో భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. ఆదివారం వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
అనంతరం దాసు బయటకు వెళ్లగా, రేఖ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాసేపటికి తిరిగి వచ్చిన దాసు చనిపోయిన భార్యను చూసి భయాందోళనకు గురయ్యాడు. పోలీసులకు తెలిస్తే ఇరుక్కుంటానన్న భయపడ్డాడు. మృతదేహాన్ని ఎవరికీ అనుమానం రాకుండా ఆస్పత్రిలో వదిలేస్తే అనాథ శవంగా మిగిలిపోతుందని కొందరు ఇచ్చిన సలహాతో పథకం వేశాడు. తన స్నేహితుడితో కలిసి రేఖ మృతదేహాన్ని దుప్పటిలో చుట్టాడు.
అనంతరం ఆమె ఆరోగ్యం బాగోలేదని నమ్మించి ఓ ఆటోను మాట్లాడి అర్ధరాత్రి దాటిన తర్వాత గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అత్యవసర విభాగం ఎదురుగా ఉన్న వెయిటింగ్ హాల్ వద్ద ఆటో దిగి, మృతదేహాన్ని లోపల పడేసి అక్కడి నుంచి జారుకునేందుకు ప్రయత్నించారు.
ఎమర్జెన్సీ వార్డు మెయిన్ గేట్ వద్ద విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డుకు అనుమానం వచ్చి వారిని ఆపి నిలదీయగా పొంతనలేని సమాధానాలు చెప్పారు. దీంతో సెక్యూరిటీ సూపర్‌వైజర్లు, ఇతర సిబ్బంది అక్కడికి చేరుకుని వెయిటింగ్ హాలులో చూడగా రేఖ మృతదేహం కనిపించింది. వారిని పేట్‌బషీరాబాద్ పోలీసులకు అప్పగించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు.
