ఇబ్రహీంపట్నం, వెలుగు: ఫార్మాసిటీని రద్దు చేసి, ప్రభుత్వం గతంలో సేకరించిన భూములను తిరిగి రైతులకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ యాచారం ఫార్మాసిటీ బాధిత రైతులు సోమవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం(ప్రజాభవన్)ను ముట్టడించారు.
బతుకమ్మ ఆడి, ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫార్మాసిటీ కోసం ప్రభుత్వం సేకరించిన భూముల విషయంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఫార్మాసిటీ కోసం తీసుకున్న భూములపై నిర్ణయాన్ని పునఃపరిశీలించి, ఫార్మాసిటీ ప్రతిపాదనను రద్దు చేయడంతో పాటు తమ భూములను తిరిగి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అందుబాటులో లేకపోవడంతో రైతులు అంబేద్కర్ చౌరస్తాకు పాదయాత్రగా బయలుదేరారు. వారిని పోలీసులు అరెస్టు చేసి మంచాల పోలీస్ స్టేషన్‌కు తరలించి, సాయంత్రం వదిలేశారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాల రైతులు పాల్గొన్నారు.
