- ట్రేడర్ల లైసెన్స్‌రద్దు చేయండి : మంత్రి తుమ్మల
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో జీరో బిజినెస్ జరగకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. బుధవారం సెక్రటేరియెట్‌లో మార్కెటింగ్, మార్క్‌ఫెడ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత రెండేండ్లలో మార్కెట్ యార్డుల్లో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిని తెలుసుకొని, వేగంగా పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్రంలోని మార్కెట్ యార్డులకు రూ.568.50 కోట్ల వ్యయంతో 630 అభివృద్ధి పనులు మంజూరు కాగా.. వాటిలో రూ.128 కోట్ల విలువైన 113 పనులు పూర్తయ్యాయని మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి తెలిపారు.
కొన్ని యార్డుల్లో జీరో బిజినెస్ కొనసాగుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్న మంత్రి.. అలాంటి ట్రేడర్ల లైసెన్స్‌రద్దు చేయాలన్నారు. దీనికి ఎవరైనా అధికారులు సహకరిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పంట ఉత్పత్తుల రక్షణకు మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని చెప్పారు. గడ్డిఅన్నారం మార్కెట్‌లో అమలు చేస్తున్న స్మార్ట్ మార్కెట్ యార్డ్ సాఫ్ట్‌వేర్ వివరాలను అధికారులు అందజేశారు.
ఒక సీజన్ కు ప్రయోగాత్మకంగా అమలు చేసి, ఫలితాలు ఆశాజనకంగా ఉంటే అన్ని యార్డులను డిజిటలైజ్చేయాలని మంత్రి ఆదేశించారు. కోహెడ పండ్ల మార్కెట్‌కు సంబంధించిన సర్వే పూర్తయిందని, డిజైన్ రూపకల్పన అనంతరం టెండర్ల ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుందని తెలిపారు. విద్యుత్ఖర్చు తగ్గించేందుకు సోలార్ రూఫ్‌టాప్ ప్యానెళ్ల ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలని చెప్పారు. పంట ఉత్పత్తుల కొనుగోలుపై ప్రత్యేక దృష్టిపెట్టాలని మంత్రి సూచించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, మార్క్‌ఫెడ్ ఎండీ శ్రీనివాస్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

