నీటి అవసరం తక్కువగా ఉండే పంటలు సాగు చేయాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

నీటి అవసరం తక్కువగా ఉండే పంటలు సాగు చేయాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
  • వరి, మిర్చికి బదులుగా ఆయిల్‌‌‌‌పామ్, చిరు, పప్పు ధాన్యాలు సాగు చేయాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం టౌన్, వెలుగు : తాగునీటిని కాపాడుకుంటూ, అధిక నీటి అవసరం ఉన్న పంటలకు బదులుగా ఇతర పంటలు సాగు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్ తో కలిసి బుధవారం వి.వెంకటాయపాలెం డీప్‌‌‌‌ కట్ వద్ద గోదావరి జలాలను పరిశీలించి, పూజలు చేశారు. అనంతరం ఆఫీసర్లు, ఇంజినీర్లతో కలిసి తాగునీటి సంరక్షణ, నీటి లభ్యత, గోదావరి జలాలను ఖమ్మం వైపు మళ్లించే కార్యాచరణపై చర్చించారు. అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడుతూ ప్రస్తుతం ప్రాజెక్టుల్లో నీటి లభ్యత పరిమితంగా ఉన్నందున ప్రతి చుక్కనూ జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు. 

ఆయిల్‌‌‌‌పామ్, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాల వంటి తక్కువ నీటి అవసరం ఉన్న పంటలను సాగు చేయాలని చెప్పారు. సూపర్ ఎల్‌‌‌‌నినో ప్రభావం 1977లో వచ్చిన కరువు కంటే తీవ్రంగా ఉండే అవకాశం ఉందన్నారు.  ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఎల్ నినో ప్రభావం పెరిగి భూగర్భజలాలు మరింత తగ్గే ప్రమాదం ఉందన్నారు. వైరాకు తరలించిన గోదావరి నీటిని రాజీవ్ కాల్వ షట్టర్లు మూసి, తిరిగి ఖమ్మం వైపు మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. 

పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో బొగ్గు, గ్యాస్ కొరత ఏర్పడి విద్యుత్ సరఫరా, యూరియా ఉత్పత్తిపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయన్నారు. యూరియా అమ్మకాలు పారదర్శకంగా కొనసాగేందుకే యాప్ ను తీసుకొచ్చామన్నారు. ఖమ్మం నగరంలో ప్రణాళికాబద్ధంగా మొక్కలు నాటాలని, విద్యుత్ స్తంభాల సమీపంలో మొక్కలు నాటకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ దివాకర టీఎస్, కమిషనర్ సునీల్ దత్ తో కలిసి దంసలాపురం వద్ద గ్రీన్‌‌‌‌ఫీల్డ్ జాతీయ రహదారి ఆర్‌‌‌‌ఓబీ పనులను పరిశీలించారు. ఈ హైవే ప్రారంభం అయితే ఖమ్మం, వైరా, సత్తుపల్లి పట్టణాల్లో ట్రాఫిక్ తగ్గే అవకాశం ఉందన్నారు.