మున్నేరు–పాలేరు లింక్.. ఏటా 50 టీఎంసీలు వాడుకునేలా ప్రాజెక్టు : మంత్రి ఉత్తమ్

మున్నేరు–పాలేరు లింక్.. ఏటా 50 టీఎంసీలు వాడుకునేలా ప్రాజెక్టు : మంత్రి ఉత్తమ్
  • వినియోగించుకోకుండా ఉంటున్న వరద జలాలపై దృష్టి: మంత్రి ఉత్తమ్​

హైదరాబాద్​, వెలుగు: ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్​ జిల్లాలకు సాగునీరందించేలా మున్నేరు–పాలేరు లింక్​ స్కీమ్​ను చేపడుతున్నట్టు ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్ ​ కుమార్​ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకూ పట్టించుకోకుండా ఉన్న సహజ వనరులను వినియోగించుకుంటూ.. వరదల నివారించేలా ప్రభుత్వం ఈ కొత్త స్కీమ్​ను తీసుకొస్తున్నదని శనివారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ఏటా 50 టీఎంసీలను వినియోగించుకునేలా ప్రాజెక్టును నిర్మిస్తామని చెప్పారు. ఖమ్మం జిల్లాను ఫ్లాష్​ ఫ్లడ్​తో వణికిస్తున్న మున్నేరు నది వరద నీటిని ఈ ప్రాజెక్టులో వాడుకుంటామని, తద్వారా ఖమ్మం జిల్లాకు వరదల నుంచి కూడా విముక్తి కల్పిస్తామని తెలిపారు. 

సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని ఈ లింక్​ స్కీమ్​లోకి మళ్లించి కరువు ప్రాంతాలకు నీళ్లిస్తామన్నారు. వరద జలాల్లో 50 నుంచి 60 టీఎంసీలను వాడుకునేలా మున్నేరు పాలేరు గ్రావిటీ  స్కీమ్​ ఉపయోగపడుతుందన్నారు. మహబూబాబాద్​ జిల్లాలోని ముల్కనూరు చెక్​డ్యామ్​ నుంచి నీటిని రీడైరెక్ట్​  చేస్తామన్నారు. ఆ నీళ్లను పాలేరు బ్యాలెన్సింగ్​ రిజర్వాయర్​  లింక్​ కెనాల్​కు తరలించి పంపింగ్​ అవసరం లేకుండానే నీటిని సరఫరా చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టుకు నిరుడు మే 17వ తేదీనే రూ.162.54 కోట్లతో పరిపాలనా అనుమతులు జారీ చేశామన్నారు. త్వరలోనే దాని నిర్మాణం ప్రారంభిస్తామని తెలిపారు. 

కరెంట్​ ఖర్చుల భారం లేకుండా

ఈ గ్రావిటీ స్కీమ్​ ద్వారా లిఫ్ట్​ ఇరిగేషన్​లో అయ్యే కరెంటు ఖర్చులు రూ.120 కోట్ల వరకు ఆదా చేయొచ్చని మంత్రి ఉత్తమ్​ అన్నారు. ఇటు సీతారామా ప్రాజెక్టుపైనా భారం తగ్గుతుందన్నారు. ఇది కేవలం నీళ్లకు సంబంధించిన అంశమే కాదని, స్మార్ట్​గా నీటిని వినియోగించుకోవడమని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా మూడు జిల్లాల్లో 1.38 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని, అది కాకుండా ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో నాగార్జునసాగర్​ ప్రాజెక్ట్​ కింద ఉన్న 40 వేల ఎకరాలను స్థిరీకరిస్తామని పేర్కొన్నారు. 

ఖరీఫ్​లో ఎస్ఆర్ఎస్​పీ స్టేజ్​ 2 కింద 76,308 ఎకరాలు, సూర్యాపేట జిల్లాలోని డీబీఎం కింద 46,712 ఎకరాలు, అదే జిల్లాలోని డీబీఎం 71 కింద మరో 46,712 ఎకరాలకూ నీళ్లిస్తామన్నారు.  మూడు జిల్లాల్లో తాగునీటి అవసరాల కోసం పాలేరు రిజర్వాయర్​కు 4.7 టీఎంసీలను ఈ ప్రాజెక్ట్​ ద్వారా సప్లయ్  చేస్తామని పేర్కొన్నారు. దాంతోపాటు పాలేరు రిజర్వాయర్​ కింద హైడల్​ ప్లాంట్​లో అదనంగా 2 మెగావాట్ల విద్యుత్​ను ఉత్పత్తి చేసేందుకు అవకాశం దొరుకుతుందని పేర్కొన్నారు.