అబద్ధాల రాజకీయాలకు కేరాఫ్‌‌ బీఆర్‌‌‌‌ఎస్‌‌..రైతులను తప్పుదోవ పట్టించేలా కేటీఆర్ వ్యాఖ్యలు: మంత్రి ఉత్తమ్

అబద్ధాల రాజకీయాలకు కేరాఫ్‌‌ బీఆర్‌‌‌‌ఎస్‌‌..రైతులను తప్పుదోవ పట్టించేలా కేటీఆర్ వ్యాఖ్యలు: మంత్రి ఉత్తమ్
  • ధాన్యం కొనుగోళ్లలో రైతులు మరణించారన్నది అవాస్తవం

హైదరాబాద్, వెలుగు: అర్ధసత్యాలు, అబద్ధాల రాజకీయాలకు బీఆర్‌ఎస్‌ పెట్టింది పేరని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. రైతుల సంక్షేమంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ విడుదల చేసిన ప్రకటన పూర్తిగా అవాస్తవాలతో నిండిందని మండిపడ్డారు. గురువారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటివరకు ఒక్క రైతు మృతి చెందలేదన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే తెలంగాణలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి నమోదైందన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న 2025- –26 యాసంగిలో రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటివరకు 54.29 లక్షల టన్నుల ధాన్యం కేంద్రాలకు చేరగా, అందులో 46.21 లక్షల టన్నులు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. 

రైతులకు రూ.7,841 కోట్లు చెల్లించాం..

కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రూ.7,841 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని, మొత్తం 6.3 లక్షల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు చేశామన్నారు. కొనుగోళ్ల కోసం 18.3 కోట్ల గన్నీ బ్యాగులను సిద్ధంగా ఉంచామని, రవాణాకు 13 వేల వెహికల్స్​ను వినియోగిస్తున్నట్లు చెప్పారు. వాస్తవాలను పక్కనబెట్టి రైతులను తప్పుదోవ పట్టించేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు జరుగుతుంటే దానిని వక్రీకరించి అసత్య ప్రచారం చేయడం బీఆర్‌ఎస్‌ డొల్ల రాజకీయాలకు నిదర్శనమన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు, మిల్లర్లతో కుమ్మక్కు, చెల్లింపుల్లో జాప్యం జరిగిందని ఆయన గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్​ను ఏటీఎంలా ఉపయోగించి రూ.వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిస్థితి గత ప్రభుత్వ అవినీతికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ప్రాజెక్టుపై శాస్త్రీయ అధ్యయనం చేస్తోందన్నారు.