- ప్రైవేట్ ఉద్యోగుల పెన్షన్‌కు కాకా ఆద్యుడు: మంత్రి వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, వెలుగు: ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగుల భద్రత కోసం పెన్షన్ పథకాన్ని తన తండ్రి కాకా వెంకటస్వామి తీసుకువచ్చారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ భవన్‌లో గురువారం మంత్రి వివేక్ వెంకటస్వామి, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కలిసి తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ, తన తండ్రి స్ఫూర్తితోనే గిగ్ వర్కర్స్ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చామని చెప్పారు.
రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆ చట్టాన్ని అమలు చేసి, గిగ్ వర్కర్ల భద్రత కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కనీస వేతనాలను పెంచలేదని విమర్శించిన మంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం కనీస వేతనాలను పెంచేందుకు చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ప్రైవేట్ ఉద్యోగుల పాత్ర కీలకమని, ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తుందని తెలిపారు. ప్రైవేట్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎంతో చర్చించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవతోనే గిగ్ వర్కర్స్ చట్టం వచ్చిందని అన్నారు. కార్మికుల సంక్షేమం కోసం ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. అలాగే, బ్లూ కాలర్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం మరింత చొరవ చూపాలని కోదండరాం విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీజీఓ జనరల్
సెక్రటరీ శ్యామ్, ప్రైవేట్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
టోలిచౌకిలో ప్రమాదంపై వెంటనే రిపోర్ట్ ఇవ్వండి
టోలిచౌకిలో గురువారం జరిగిన ప్రమాదం, గాయపడిన కార్మికుల పరిస్థితిపై వెంటనే రిపోర్ట్ ఇవ్వాలని అధికారులను మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశించారు. టోలిచౌకిలో నిర్మాణంలో ఉన్న భవనం పైనుంచి పడి ఇద్దరు కార్మికులు మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న మంత్రి.. సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
