- భవిష్యత్ అవసరాల కోసం సిలబస్‌లో మార్పులు చేయాలి: మంత్రి వివేక్
- ఇండస్ట్రీల్లో కార్మికుల భద్రతపై రాజీ పడొద్దు
- సేఫ్టీ మేనేజ్మెంట్పై పర్యవేక్షణ ఉండాలి
- సిగాచీ వంటి ఘటనలు పునరావృతం కావొద్దు
- ఈఎస్ఐ సేవలపై ఫిర్యాదులొస్తే ఊరుకునేది లేదన్న మంత్రి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల (ఏటీసీ) ద్వారా తక్షణమే ఏఐ కోర్సులను ప్రారంభించాలని, పరిశ్రమల్లో ‘సిగాచీ’ వంటి ప్రమాదాలు పునరావృతం కావొద్దని కార్మిక, ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అధికారులను ఆదేశించారు. నూతన సంవత్సరం సందర్భంగా గురువారం సెక్రటేరియెట్లో ఆయా శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈఎస్ఐ ఆస్పత్రుల్లో వైద్య సేవలపై ఫిర్యాదులు వస్తే ఉపేక్షించేది లేదని, అవసరమైతే కొత్త డిస్పెన్సరీలు ఏర్పాటు చేసైనా కార్మికులకు నాణ్యమైన వైద్యం అందించాల్సిందేనని స్పష్టం చేశారు. మారుతున్న కాలానికి, సాంకేతికతకు అనుగుణంగా యువతను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం సంప్రదాయ కోర్సులతో సరిపెట్టకుండా, ప్రస్తుత, భవిష్యత్ పారిశ్రామిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏటీసీల సిలబస్‌లో మార్పులు చేయాలని సూచించారు.
పరిశ్రమలు ఇప్పుడు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని వాడుతున్నందున, దానికి తగ్గట్టుగా ఏఐ ఆధారిత నైపుణ్యాభివృద్ధి కోర్సులను ప్రవేశపెట్టాలని, తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయన్నారు. ఉద్యోగ కల్పనే ధ్యేయంగా శిక్షణ ఉండాలని అధికారులకు సూచించారు. కార్మికుల భద్రత, ఆరోగ్యంపై సిగాచీ పరిశ్రమలో జరిగిన ప్రమాద ఘటనను ప్రస్తావించారు. కార్మికుల ప్రాణరక్షణ విషయంలో ఏమాత్రం అలసత్వం వహించినా, రాజీపడినా ఊరుకునేది లేదని పరిశ్రమల శాఖ అధికారులను హెచ్చరించారు. పరిశ్రమలు భద్రతా ప్రమాణాలను పాటించేలా నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. అలాగే ఈఎస్ఐ పరిధి ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదన్న విమర్శలకు తావివ్వకూడదని, అదనపు డిస్పెన్సరీల ఏర్పాటుకు వెనుకాడొద్దని స్పష్టం చేశారు. ఈ సమీక్షలో స్పెషల్ సీఎస్ దాన కిషోర్, తదితరులు పాల్గొన్నారు.
