- 150 మీటర్ల ఎత్తుతో నిర్మాణానికి గతంలోనే ఒప్పందం: మంత్రి వివేక్
- ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణలోని 16 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్నదే సీఎం ఆలోచన
- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 2 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వొచ్చు
- మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌ను ఒప్పించేందుకు తెలంగాణ బీజేపీ ఎంపీలు కృషి చేయాలని సూచన
- తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించే ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రులు వివేక్, జూపల్లి
ఆసిఫాబాద్/ కాగజ్ నగర్, వెలుగు: తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే మహారాష్ట్రకు ఎటువంటి నష్టం ఉండదని, ఆ రాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఒప్పుకోవాలని రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం చౌహాన్ మధ్య ఈ ప్రాజెక్టును 150 మీటర్ల ఎత్తులో కట్టేందుకు ఒప్పందాలు జరిగాయని గుర్తు చేశారు.
త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. శుక్రవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించే ప్రాంతాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి వివేక్ పరిశీలించారు. ప్రాణహిత నదికి పూజలు చేసి చీరె, సారె, పూలు సమర్పించారు.
అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. బుద్ద విహార్ లో బుద్ధునికి పూజలు చేశారు. అనంతరం మంత్రి వివేక్ మీడియాతో మాట్లాడుతూ. ప్రాణహిత ప్రాజెక్టుకు ఒప్పుకునేలా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ను బీజేపీ కేంద్ర మంత్రులు, ఎంపీలు కృషి చేయాలని సూచించారు.
బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రధానితో మాట్లాడాలి: మంత్రి జూపల్లి
ప్రాణహిత– చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టుకు సహకరిస్తామని, మహారాష్ట్రను ఒప్పిస్తామని రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీ ప్రకటించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు డిమాండ్ చేశారు. గతంలో రూ.38,500 కోట్ల అంచనా వ్యయంతో 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు డా. బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత– -చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టుకు భూమిపూజ చేశారని గుర్తుచేశారు.
అప్పట్లోనే 106 కిలోమీటర్ల మేర కెనాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి, 71.5 కిలోమీటర్ల మేర భూసేకరణ పూర్తి చేశారని, 46 కి.మీ మేర పనులు కూడా పూర్తయ్యాయని తెలిపారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మిస్తే గ్రావిటీ ద్వారా నీటిని తరలించవచ్చన్నారు. రాష్ట్రానికి చెందిన 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ప్రధాని మోదీ, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ను ఒప్పించేందుకు చొరవ తీసుకోవాలన్నారు.
మంత్రుల వెంట ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, హరీశ్ బాబు, కలెక్టర్ హరిత, ఎస్పీ నితికా పంత్ తదితరులు ఉన్నారు. అంబేద్కర్ విగ్రహ పరిసరాలను అభివృద్ధి చేయాలని అధికారులకు మంత్రులు సూచించారు. ఇందుకోసం రూ.50 వేలు విరాళంగా ఇచ్చారు. శిలాఫలకంపై ఉన్న కాకా పేరు చూసి ప్రాణహిత ప్రాజెక్ట్ కోసం తన తండ్రి గడ్డం వెంకటస్వామి కీలక పాత్ర పోషించిన విషయాన్ని వివేక్ గుర్తుచేసుకున్నారు. అప్పుడు తన సోదరుడు వినోద్ కార్మిక మంత్రిగా ఉన్నాడని పేర్కొన్నారు.
కమీషన్ల కోసమే కాళేశ్వరం కట్టారు
సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ తుగ్లక్ లా వ్యవహరించారని, అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేaశారని మంత్రి వివేక్ ఆరోపించారు. కమీషన్ల కోసం ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టును పాతరేసి కాళేశ్వరం కట్టి లక్ష కోట్లు వృథా చేశాడని విమర్శించారు. చిన్న కాంట్రాక్టర్ అయిన మేఘా కృష్ణారెడ్డి కేసీఆర్ హయాంలో ప్రపంచ స్థాయికి వెళ్లిపోయాడన్నారు.
సీఎం హోదాలో కేసీఆర్ మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు కట్టేందుకు ఒప్పందం చేసుకుని, కమీషన్ల కోసం కాళేశ్వరం కట్టాడని ఆరోపించారు. 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాజెక్టును మొదలుపెట్టారని, రూ.10 వేల కోట్లతో కాల్వల నిర్మాణం జరిగిందని, మరో 25 వేల కోట్లిస్తే కంప్లీట్ అయ్యేదని అన్నారు. కాంగ్రెస్‌కు మంచి పేరు వస్తుందని, కమీషన్లు రావని కేసీఆర్కాళేశ్వరం ప్రాజెక్టును తెరమీదకు తెచ్చాడన్నారు.
లక్ష కోట్లతో మేడిగడ్డ కడితే ఒక్క టీఎంసీ నీళ్లు కూడా సరిగా వాడలేదని, నాలుగేండ్లలో కేవలం 60 టీఎంసీలు మాత్రమే ఎల్లంపల్లికి ఎత్తి పోశారని వివరించారు. దీనికోసం వాడిన విద్యుత్‌కు సంబంధించి రూ.5 వేల కోట్ల బిల్లులు డిస్కంలకు బాకీ పడ్డారన్నారు. ప్రాణహిత ప్రాజెక్టు పూర్తి చేసి రాష్ట్రంలో 16 లక్షల ఎకరాలకు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరందించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారన్నారు.
