గత ప్రభుత్వంలో ఉన్న మంచి పథకాలను తాము కొనసాగిస్తున్నామని మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అలాగే గీత కార్మికుల రక్షణ కోసం గౌడన్నలకు కాటమయ్య రక్షక కవచాలను మంత్రి వివేక్ వెంకటస్వామి అందజేశారు.
అనంతరం మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎన్నో కొత్త పథకాలను ప్రారంభించామని గుర్తు చేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ చీరలు ఎంతో బాగున్నాయని, మహిళలందరూ వాటిని ధరిస్తే చూడటానికి చాలా ముచ్చటగా ఉంటుందని మంత్రి వ్యాఖ్యానించారు.
తాము రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని...పార్టీల విభేదాలు లేకుండా, అర్హులైన వారందరికీ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విద్య, వైద్య రంగాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిందని, పేదలకు నాణ్యమైన సేవలు అందించడమే తమ లక్ష్యమని మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు.
