గెలిపించిన గజ్వేల్ ప్రజలనే పట్టించుకోని నువ్వు..తోలు తీస్తవా.?:మంత్రి వివేక్ వెంకటస్వామి

గెలిపించిన గజ్వేల్ ప్రజలనే పట్టించుకోని నువ్వు..తోలు తీస్తవా.?:మంత్రి వివేక్ వెంకటస్వామి
  • కేసీఆర్​పై మంత్రి వివేక్​ వెంకటస్వామి ఫైర్​
  •     రెండేండ్లు ఫామ్​హౌస్​లో పడుకొని అవాకులు చవాకులు మాట్లాడుతున్నడు
  •     గజ్వేల్​లో కాంగ్రెస్​ బలపడడంతో కేసీఆర్ గుండెల్లో గుబులు 
  •     బీఆర్ఎస్ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతున్నది 
  •     పంచాయతీ ఎన్నికల్లో కారు టైరు పంక్చర్​ అయిందని ఎద్దేవా
  •     గజ్వేల్​లో మంత్రి పొన్నంతో కలిసి కొత్త సర్పంచ్​లకు సన్మానం

గజ్వేల్, వెలుగు:‘‘గెలిపించిన గజ్వేల్​ప్రజలనే పట్టించుకోని నువ్వు.. మా తోలు తీస్తవా..’’ అంటూ మాజీ సీఎం కేసీఆర్​పై మంత్రి వివేక్​వెంకటస్వామి మండిపడ్డారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్  ఎక్కువ స్థానాల్లో గెలవటం చూసి కేసీఆర్​గుండెల్లో గుబులు మొదలైందని.. అందుకే ఆయన అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని ఫైర్​అయ్యారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతోందని మంత్రి పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్​లో కాంగ్రెస్​మద్దతుతో గెలుపొందిన సర్పంచ్​లను శుక్రవారం  మంత్రి పొన్నం ప్రభాకర్​తో కలిసి ఆయన సన్మానించారు. పంచాయతీ ఎన్నికల్లో కారు టైరు పంచర్ అయిందని.. తన సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్  మెజారిటీ  సర్పంచ్​లు గెలవటం, సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్  బలపడటాన్ని తట్టుకోలేకనే కేసీఆర్  పిచ్చిపిచ్చి వాఖ్యలు చేస్తున్నారని వివేక్​ వెంకటస్వామి అన్నారు. రెండు సంవత్సరాలుగా ఫామ్​ హౌస్​ లో కూర్చొని ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. 

స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ..​ గజ్వేల్ లో  90కి పైగా, దుబ్బాకలో 56 స్థానాలు దక్కించుకోవడం కేసీఆర్​ సొంత జిల్లాలో బీఆర్‌‌ఎస్ పతనానికి నిదర్శనమన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ తరువాత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లు డబుల్ అయ్యాయన్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు సాగుతోందన్నారు. దీనికి భిన్నంగా బీఆర్‌‌ఎస్ పార్టీ ఓటు శాతం మొదట 37 శాతానికి, పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 17 శాతానికి పడిపోయిందన్నారు. జూబ్లీహిల్స్ బైఎలక్షన్‌‌లో కాంగ్రెస్ పార్టీ 25 వేల ఓట్ల మెజారిటీతో గెలవడానికి గజ్వేల్​ పార్టీ శ్రేణులు ఎంతో కృషి చేశాయని గుర్తుచేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు, సన్నబియ్యం, కొత్త రేషన్ కార్డులు, గ్యారంటీ కార్డులపై ప్రజల్లో సానుకూల స్పందన ఉందన్నారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్​లు.. ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తే ప్రజలకు మరింత నమ్మకం పెరుగుతుందన్నారు. గ్రామాభివృద్ధికి అవసరమైన  రోడ్లు, అదనపు ఇందిరమ్మ ఇండ్ల అంశాన్ని ఇప్పటికే సీఎం దృష్టికి తీసుకెళ్లామన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడమే లక్ష్యంగా కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు.

పథకాల అమలులో సర్పంచులే కీలకం: మంత్రి పొన్నం 

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామస్థాయిలో ప్రజల దాకా చేర్చే బాధ్యత సర్పంచ్​లు, ఉప సర్పంచ్​లు, వార్డు సభ్యులదేనని మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు. గ్రామాల్లో ఎన్నికల అనంతరం ఎలాంటి విభేదాలు లేకుండా అందరినీ కలుపుకొని పాలన సాగించాలని, ఓడిపోయినవారిని కూడా గౌరవంతో చూడాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ బలాన్ని గ్రామస్థాయిలో మరింత పెంచాలన్నారు. ప్రజల విశ్వాసానికి తగ్గట్టుగా పనిచేస్తే కాంగ్రెస్ పార్టీకి మరింత ఆదరణ లభిస్తుందన్నారు. కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్​తూంకుంట ఆంక్షరెడ్డి, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే  నర్సారెడ్డి, కాంగ్రెస్​ నాయకులు ఎలక్షన్​రెడ్డి, భూంరెడ్డి, గజ్వేల్, వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్లు​ నరేందర్​రెడ్డి, విజయమోహన్, పార్టీ మండల అధ్యక్షులు, నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.