మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ నేతలు తమపై గూండా గిరి చేశారన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. దాడులు చేస్తే అరెస్ట్ చేయకుండా ఎలా ఉంటారని ప్రశ్నించారు. గురువారం (ఫిబ్రవరి 19) మీడియాతో మాట్లాడిన మంత్రి.. బీఆర్ఎస్ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులకు దిగటం సరికాదని సూచించారు.
కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. తాము అధికార దుర్వినయోగం చేస్తే క్యాతనపల్లిలో బీఆర్ఎస్ గెలిచేదా? అని ప్రశ్నించారు. ఈ అంశంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పాలనపై అధిష్టానం సమీక్ష చేస్తుందని తెలిపారు మంత్రి వివేక్. పార్లమెంటు, పంచాయతీ సహా వరుసగా ఎన్నికల్లో విజయాలు సాధిస్తున్నట్లు గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలు కూడా జరగబోతున్నట్లు చెప్పారు. నాయకత్వం చేసే సూచనలు పరిగణలో తీసుకుంటామన్నారు.
