- టామ్‌కామ్ ద్వారా విదేశాల్లో ఉద్యోగావకాశాలు: మంత్రి వివేక్ వెంకటస్వామి
- రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో ఏటీసీ నిర్మాణానికి భూమిపూజ
- పింఛన్లపై పంద్రాగస్టు రోజున సీఎం ప్రకటన చేస్తారని వెల్లడి
రాజన్న సిరిసిల్ల/ వేములవాడ, వెలుగు: తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్ కామ్) ద్వారా రాష్ట్ర యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్టు మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు. యువత జర్మనీ, జపాన్ భాషలు నేర్చుకుంటే ఆయా దేశాల్లో దాదాపు రూ. 2.50 లక్షల జీతంతో ఉద్యోగావకాశాలున్నాయని తెలిపారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో రూ.45 కోట్లతో చేపట్టిన అడ్వాన్స్ టెక్నాలజీసెంటర్ (ఏటీసీ) , రూ. 40లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణాలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి మంత్రి భూమిపూజ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తాను జర్మనీ వెళ్లినప్పుడు తమ భాష వచ్చినవారికి దాదాపు 5 లక్షల ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందని అక్కడి అధికారులు చెప్పారని, దాంతో మందమర్రిలో జర్మనీ లాంగ్వేజ్ నేర్పిస్తున్నామన్నారు.
సిరిసిల్ల జిల్లాలో కూడా 100 మందికి జర్మనీ భాష నేర్పిస్తామని, ఇందుకోసం ట్రైనర్ ను నియమిస్తామని చెప్పారు. జర్మనీ భాష నేర్చుకోవడాన్ని కేటీఆర్ తప్పుపడుతున్నాడని.. ఆయన ఇంగ్లిష్ నేర్చుకుంటే లేని తప్పు పేద పిల్లలను జర్మనీ భాష నేర్చుకుంటే వచ్చిందా? అని మంత్రి మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి చొరవతో తెలంగాణలో 65 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, వీటితో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని వివరించారు. బీఆర్ఎస్ హయాంలో 11 సెంటర్లు పెట్టినా సరైన వసతులు కల్పించకపోవడం వల్ల ఎవరూ జాయిన్ కాలేదన్నారు. రెండున్నరేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. పంద్రాగస్టు నాటికి కొత్త పింఛన్లపై సీఎం ప్రకటన చేయబోతున్నారని చెప్పారు. గతంలో ఓడిపోయినా నిత్యం ప్రజల మధ్యే ఉన్న ఆది శ్రీనివాస్ 2023లో ఎమ్యెల్యేగా గెలిచి సీఎం ఆశీస్సులతో ప్రభుత్వ విప్ ఆయ్యారని, ఆయన మంత్రి కావాలని కోరుకుంటున్నానన్నారు.
సీఎం సీటు కోసం బావబామర్ధుల పోటీ
కేటీఆర్ కు సీఎం కావాలనే ఆశ ఉందని.. ఆయన బావ హరీశ్ రావు కూడా పదవి కోసం ఆరాట పడుతున్నాడని.. దీంతో వారిమధ్య పోటీ నడుస్తోందని మంత్రి వివేక్అన్నారు. ప్రజా ధనాన్ని దోచుకునేందుకే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారన్నారు. కాళేశ్వరం నీళ్లు లిఫ్ట్ చేయాలని కేటీఆర్, హరీశ్ మాట్లాడుతున్నారని, బ్యారేజ్ లు సరిగా లేకుండా ఎలా పంపింగ్ చేస్తారని మంత్రి ప్రశ్నించారు. కేసీఆర్ తుగ్లక్ లాగా వ్యవహరించారని, కింద కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి పైకి నీటిని ఎత్తిపోస్తారా? అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధి కల్పన, శిక్షణ శాఖ డైరెక్టర్ నిర్మల క్రాంతి వెస్లీ, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బి గితె, మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకుల తిరుపతి, ఆత్మ కమిటీ డివిజన్ చైర్మన్ ముకుంద రెడ్డి, ఆర్డీవో కే ఎస్ బీ కుమారి, డీఎస్పీ శ్రీనివాసులు, పీఆర్ ఈఈ సుదర్శన్ రెడ్డి, మైనింగ్ శాఖ ఏడీ క్రాంతి, తహసీల్దార్ పుష్పలత, ఎంపీడీఓ నటరాజ్, సర్పంచ్ గండి నారాయణ పాల్గొన్నారు.
కాంగ్రెస్‌తోనే వేములవాడ అభివృద్ధి: ఆది శ్రీనివాస్
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే వేములవాడ నియోజకవర్గం అభివృద్ధి చెందుతోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ టెంపుల్ డెవలప్ మెంట్ కోసం నిధులిచ్చారని, ఆలయం భూములను ఎకరం నుంచి 7 ఎకరాలకు పెంచామన్నారు. రుద్రంగి ఏటీసీలో 288 మంది విద్యార్థులు 7 కోర్సులు నేర్చుకోనున్నారని చెప్పారు.
