- భవిష్యత్‌లో మరిన్ని సంక్షేమ సదుపాయాలు అందిస్తాం: మంత్రి వివేక్ వెంకటస్వామి
- సమాజాన్ని చైతన్య పరచడంలో జర్నలిస్టులది కీలక పాత్ర అని వెల్లడి
- ఎన్‌యూజేఐ జాతీయ కార్యవర్గ సమావేశానికి హాజరు
ముషీరాబాద్, వెలుగు: ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో మీడియా ఫోర్త్ పిల్లర్‌గా కీలక పాత్ర పోషిస్తున్నదని కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జర్నలిస్టులు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారని, ఆ సమస్యలపై చర్చించేందుకు ఇలాంటి జాతీయ స్థాయి సమావేశం నిర్వహించడం శుభపరిణామమని పేర్కొన్నారు. నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఇండియా) జాతీయ కార్యవర్గ సమావేశాలు తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ (టీఎస్‌జేయూ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో గురువారం ప్రారంభమయ్యాయి. చిక్కడపల్లిలోని హోటల్ శ్రీవేద ప్రీమియంలో జరిగిన ఈ సమావేశాలకు మంత్రి వివేక్ ముఖ్య అతిథిగా హాజరై, ప్రారంభించారు.
ఈ సమావేశానికి తనను ఆహ్వానించినందుకు నిర్వాహకులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన జర్నలిస్టులందరికీ త్వరలో తెలంగాణ ప్రభుత్వం అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో జర్నలిస్టులకు మరిన్ని సంక్షేమ సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సమాజాన్ని చైతన్య పరచడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఈ సమావేశంలో పీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాన్ల ఝాన్సీ రెడ్డి, ఎన్‌యూజే(ఐ) జాతీయ అధ్యక్షులు సురేశ్ శర్మ, జాతీయ ప్రధాన కార్యదర్శి త్రియగ్ నారాయణ, టీఎస్‌జేయూ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పురుషోత్తం నారగౌని, తోకల అనిల్ కుమార్, ఎన్‌యూజే(ఐ) కార్యదర్శి మెరుగు చంద్రమోహన్, రాజు పటేల్, అరుణ్ కుమార్, పావుశెట్టి శ్రీనివాస్, కందికొండ మోహన్, చిర్రగోని ఉదయ్ దీర్, ఉప్పలంచి నరేందర్, పోచంపల్లి రజిత, నాగరాజు, శ్రీనాథ్, అవునురి సంపత్, గట్టు మహేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

