సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులదే విజయం : మంత్రి వివేక్‌‌‌‌

సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులదే విజయం : మంత్రి వివేక్‌‌‌‌

కోల్​బెల్ట్​/చెన్నూరు, వెలుగు: పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ ​అభ్యర్థులు విజయం సాధిస్తారని రాష్ట్ర కార్మిక, గనులశాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు కాంగ్రెస్​ హవా నడుస్తున్నదని చెప్పారు. ఆదివారం రాత్రి మంచిర్యాల జిల్లా జైపూర్, భీమారం మండల కేంద్రాలు, చెన్నూర్‌‌‌‌‌‌‌‌ క్యాంపు ఆఫీస్‌‌‌‌లో కాంగ్రెస్​ పార్టీ బలపరిచిన సర్పంచ్​ అభ్యర్థులకు మంత్రి వివేక్‌‌‌‌ వెంకటస్వామి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా సన్నబియ్యం ఇవ్వడంలేదని,  తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు మాత్రమే ఇస్తున్నదని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం  ప్రాధాన్యత ఇస్తున్నదని తెలిపారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ హయంలో అమలు చేసిన రూ.10 లక్షల దళిత బంధు స్కీమ్‌‌‌‌లో కమీషన్ల పేరుతో  3 లక్షల నుంచి 4  లక్షల వరకు లీడర్లే  స్వాహా చేశారని అన్నారు. పెద్దపెద్ద బిల్డింగ్‌‌‌‌  నిర్మాణాలు చేపట్టి కమీషన్లు మింగారని మండిపడ్డారు. జూబ్లీహిల్స్‌‌‌‌లో 12 ఏండ్లుగా  బీఆర్ఎస్​ ఎమ్మెల్యే ఉన్నా.. ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పారు. అక్కడ ఉప ఎన్నికల సమయంలో మొదట్లో కాంగ్రెస్​ పార్టీకి అదరణ తక్కువగా ఉందని, తాను ఇన్‌‌‌‌చార్జీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సంక్షేమ పథకాలను అందరికీ వర్తింపజేసి పట్టుసాధించామన్నారు. ప్రజలు ఆదరించి 25 వేల మెజార్టీతో కాంగ్రెస్  అభ్యర్థి నవీన్​యాదవ్​ను  గెలిపించారని తెలిపారు. 

 రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు 

చెన్నూరు నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ఈ ఏడాది రూ.200 కోట్ల ఫండ్స్‌‌‌‌తో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు మంత్రి వివేక్​ వెంకటస్వామి తెలిపారు. బీఆర్ఎస్​ హయాంలో నియోజకవర్గంలోని పట్టణాలు, గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక వసతులను పట్టించుకోలేదన్నారు.  తాను ఎమ్మెల్యే అయిన తర్వాత  అన్ని పట్టణాలు, గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించినట్లు చెప్పారు. నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. వచ్చే ఏడాది మరో 3,500 ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్​ బలపరుస్తున్న సర్పంచ్​అభ్యర్థులందరూ గెలుస్తారని ధీమా వ్యక్తంచేశారు. చెన్నూరు క్యాంపు ఆఫీసులో జరిగిన సమావేశంలో కోటపల్లి మండలం ఎసన్వాయి సర్పంచ్‌‌‌‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన కాంగ్రెస్​ అభ్యర్థి మారపాక రజిత- సుఖేందర్‌‌‌‌‌‌‌‌ను మంత్రి వివేక్‌‌‌‌ అభినందించారు. మంత్రి వెంట మంచిర్యాల డీసీసీ ప్రెసిడెంట్​ పిన్నింటి రఘునాథ్‌‌‌‌రెడ్డి తదితరులున్నారు.