- ఈ ఏడాది డిసెంబర్‌లోపు ఇంటింటికీ నల్లా కలెక్షన్లు: మంత్రి వివేక్ వెంకటస్వామి
కోల్‌బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీలకు కొత్తగా వెయ్యి ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. సొంత స్థలం ఉన్న వాళ్లకు ఇండ్లను మంజూరు చేస్తామని చెప్పారు. శుక్రవారం జిల్లాలోని ఆయా మున్సిపాలిటిల్లో పర్యటించిన మంత్రి.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, స్వయం సహాయక గ్రూప్ మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పేద, మధ్య తరగతి కుటుంబాలకు మేలు చేసేందుకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ స్కీమ్‌లు అమలు చేస్తున్నామని చెప్పారు.
అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా ఆఫీసర్లు శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. డ్రింకింగ్ వాటర్ సప్లై కోసం రూ.30 కోట్లతో అమృత్ స్కీం పనులు చేపట్టామని, డిసెంబర్ నాటికి ఇంటింటికి నల్లా ద్వారా నీళ్లు అందిస్తామని తెలిపారు. మందమర్రిలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను త్వరలో అర్హులకు అందజేస్తామని హామీ ఇచ్చారు. రోడ్ల పక్కన కూరగాయలు అమ్ముకుంటున్న వారి కోసం సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి స్థలం కేటాయించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
మందమర్రి పట్టణ సుందరీకరణ పనులు వెంటనే ప్రారంభించాలని ఆఫీసర్లను ఆదేశించారు. మరోవైపు, మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ ఓపెన్ కాస్ట్ విస్తరణలో భాగంగా ఫేజ్2 కొత్త మైన్ మంజూరైందని, ఫారెస్టు క్లియరెన్స్ రాగానే గనిని ప్రారంభిస్తారన్నారు. ఈ గని అందుబాటులోకి వస్తే సుమారు 5 వేల కొత్త ఉద్యోగాలు దక్కే చాన్స్ ఉందని తెలిపారు. -మంత్రి వెంట మందమర్రి తహసీల్దార్ సతీశ్, ఎంపీడీవో రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు, డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ మంద తిరుమల్ రెడ్డి, ఇన్‌చార్జి గోపతి బానేశ్ తదితరులు ఉన్నారు. ---
