ఏ రాష్ట్రంలో ఎక్కడ లేనంత సమయం నిన్న తెలంగాణలో మంత్రి వర్గ సమావేశం జరిగిందన్నారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. ఇంకా ఇవాళ కొనసాగుతోందన్నారు. అయితే అందులో.. నిరుద్యోగ సమస్యపై చర్చ జరగలేదన్నారు. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్, మండలి ఎన్నికలు, నాగార్జున సాగర్ ఎన్నికల సమయంలో 50 వేల ఉద్యోగాలు ఇస్తున్నాం అంటూ కేసీఆర్ ప్రభుత్వం హామీలు గుప్పించిందని తెలిపారు. ఇలా ఇస్తే ఇప్పటి వరకు 2.5 లక్షల ఉద్యోగాలు రావాలన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో మాట్లాడారు దాసోజు.
కేసీఆర్ 7 ఏళ్ల కాలంలో ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వలేదని ఆరోపించారు. ఇంత ఘోరంగా ఎక్కడ లేదన్నారు దాసోజు శ్రవణ్. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ 3 వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామంటే..టీఆర్ఎస్ 3016 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారని..అది ఇప్పటి వరకు అమలు కాలేదన్నారు. అంతేకాదు ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రణాళికలు కూడా లేవన్నారు.
ఉద్యోగ కాలెండర్ ప్రకటించాలని మొదటి నుంచి కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు దాసోజు. 1.12 లక్షల ఉద్యోగాలు 2014 లో ఖాళీ ఉన్నాయన్నారు. బిస్వాల్ కమిటి 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి అని చెప్పారన్నారు. జిల్లాల సంఖ్య 33కు పెంచినా కూడా ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వలేదన్నారు.1.91 లక్షల పోస్ట్ లు ఖాళీలు ఉంటే 50 వేల పోస్టులు నింపుతామని ఎందుకు అంటున్నారో చెప్పాలన్నారు. 2018, ఆగస్టు 30న, 124 జి.ఓ ఇచ్చినప్పుడే 36 నెలల్లో అన్ని ఖాళీలు పూర్తి చేయాలని ఇచ్చారు..కానీ..ఇంతవరకు ఎందుకు నింపలేదో నిరుద్యోగులు టిఆర్ఎస్ నాయకులను నిలదీయండి అంటూ పిలుపునిచ్చారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేసీఆర్ కు కనికరం లేదన్నారు. ఇప్పటికైనా ఉద్యోగాల ఖాళీలతో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు దాసోజు.
