- 14 చోట్ల మంత్రులు, ఆదిలాబాద్‌కు మాత్రం సుదర్శన్ రెడ్డి
- అభ్యర్థుల ఎంపికకు ఇన్‌చార్జ్ మంత్రి చైర్మన్‌గా స్ర్కీనింగ్ కమిటీలు
- జనరల్ సీట్లలోనూ బీసీలకు వీలైనన్ని ఎక్కువ టికెట్లు ఇవ్వాలని నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలుచుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ దృష్టిసారించారు. ఈ మేరకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా మంత్రులకు ఇన్‌చార్జ్ బాధ్యతలను అప్పగిస్తూ సీఎం నిర్ణయం తీసుకోగా, అభ్యర్థుల ఎంపిక కోసం స్క్రీనింగ్ కమిటీలను నియమిస్తున్నట్టు పీసీసీ చీఫ్ ప్రకటించారు. రాష్ట్రంలో మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా... అందులో హైదరాబాద్, సికింద్రాబాద్ సెగ్మెంట్ల పరిధిలో మున్సిపల్ ఎన్నికలు జరగడం లేదు. ఇక మిగిలిన 15 నియోజకవర్గాలకు గాను 14 చోట్ల మంత్రులకు, ఆదిలాబాద్ సెగ్మెంట్ బాధ్యతలను మాత్రం ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డికి సీఎం అప్పగించారు.
మరోవైపు అభ్యర్థుల ఎంపిక కోసం లోక్‌సభ నియోజకవర్గ స్థాయిలో స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సోమవారం ప్రకటించారు. ఈ కమిటీలకు ఇన్‌చార్జ్ మంత్రి చైర్మన్‌గా, డీసీసీ చీఫ్ కన్వీనర్‌గా, ఆ నియోజకవర్గ పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలు సభ్యులుగా ఉంటారని తెలిపారు. అభ్యర్థుల ఎంపిక ఈ కమిటీలదేనని స్పష్టం చేశారు.
ఆ నియోజకవర్గాల్లో ప్రత్యేక కమిటీలు..
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మద్దతున్న 10 నియోజకవర్గాల్లో పాత, కొత్త నేతల మధ్య సమన్వయం కోసం పీసీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో రెబల్స్ బెడద లేకుండా చూడడం, అర్హులైన కార్యకర్తలకు పార్టీ టికెట్లు ఇవ్వడం, నేతల మధ్య సమన్వయం ఉండేలా చేస్తూ ఎన్నికల ప్రచారం సాజావుగా సాగేలా చూడడం ఈ కమిటీ బాధ్యత. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రెబల్స్ ఎక్కువగా పోటీ చేయడంతో పలుచోట్ల కాంగ్రెస్‌కు నష్టం జరిగింది. దీంతో మున్సిపల్‌ఎన్నికల్లో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా పీసీసీ అప్రమత్తమైంది. 90 శాతానికి పైగా మున్సిపల్ కార్పొరేషన్లను, మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలని ఇప్పటికే మంత్రులు,, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసిన సీఎం రేవంత్.. క్యాడర్‌లో జోష్ నింపేందుకు వచ్చే నెల 3 నుంచి జిల్లాల్లో పర్యటించనున్నారు.
జనరల్స్థానాల్లోనూ బీసీలకు టికెట్లు..
మున్సిపల్ ఎన్నికల్లో చట్టపరంగా బీసీలకు 32శాతం వరకు సీట్లు దక్కే అవకాశముంది. కానీ లోకల్‌బాడీ ఎన్నికల్లో బీసీలకు 42శాతం సీట్లు ఇస్తామని కాంగ్రెస్హామీ ఇచ్చింది. ఈ మేరకు బిల్లులను అసెంబ్లీలో ఆమోదించి పంపినప్పటికీ కేంద్రం వద్ద పెండింగ్పడడం. ఇప్పట్లో ఈ అంశం తేలేలా లేకపోవడంతో.. పాత పద్ధతిలోనే మున్సిపల్ ఎన్నికలకు వెళ్తున్నది. ఈ మేరకు రిజర్వేషన్లు కూడా ఖరారయ్యాయి.
దీంతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను చట్టపరంగా అమలు చేయనప్పటికీ, కనీసం పార్టీ పరంగా అమలు చేయాలని ఇటు సీఎం, అటు పీసీసీ చీఫ్ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే జనరల్ సీట్లలో కూడా పెద్దసంఖ్యలో బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు.
పార్లమెంట్ సెగ్మెంట్లవారీగా ఇన్‌చార్జులు వీరే..
1. మల్కాజిగిరి: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
2. చేవెళ్ల: దుద్దిళ్ల శ్రీధర్ బాబు
3. కరీంనగర్: తుమ్మల నాగేశ్వర్ రావు
4. ఖమ్మం: కొండా సురేఖ
5. మహబూబాబాద్: పొన్నం ప్రభాకర్
6. మహబూబ్ నగర్: దామోదర రాజనర్సింహ
7. జహీరాబాద్: అజారుద్దీన్
8. మెదక్: వివేక్ వెంకటస్వామి
9. నాగర్ కర్నూల్: వాకిటి శ్రీహరి
10. నల్గొండ: అడ్లూరి లక్ష్మణ్
11. భువనగిరి: సీతక్క
12. నిజామాబాద్: ఉత్తమ్ కుమార్ రెడ్డి
13. వరంగల్: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
14. పెద్దపల్లి: జూపల్లి కృష్ణారావు
15. ఆదిలాబాద్: సుదర్శన్ రెడ్డి (ప్రభుత్వ సలహాదారు)
