బావాబామ్మర్దుల ఒంటినిండా విషమే: మంత్రులు పొంగులేటి, వివేక్, పొన్నం ఫైర్

 బావాబామ్మర్దుల ఒంటినిండా విషమే: మంత్రులు పొంగులేటి, వివేక్, పొన్నం ఫైర్
  • కేటీఆర్, హరీశ్ రావుపై మంత్రులు పొంగులేటి, వివేక్, పొన్నం ఫైర్
  • కాంగ్రెస్‌కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకపోతున్నరు 
  • దమ్ముంటే అసెంబ్లీకి రండి.. తేల్చుకుందాం
  • కాళేశ్వరం అప్పులతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది 
  • ఆ ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు కేంద్రం ఎందుకు ముందుకొస్తలేదని ప్రశ్న

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రజాదరణ పొందుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేకనే బావ బామ్మర్దులు కేటీఆర్, హరీశ్‌‌ రావు ఒంటినిండా విషం నింపుకుని విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర మంత్రులు ధ్వజమెత్తారు. గురువారం సెక్రటేరియెట్‌‌లో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌‌ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు, ప్రతిపక్షాల తీరుపై మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌‌‌‌ రెడ్డి చేపట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పక్కనపెట్టి, కమీషన్లు దండుకునేందుకే రూ.లక్ష కోట్లతో కాళేశ్వరాన్ని నిర్మించారని ఆరోపించారు. ఎనిమిదో వింత అంటూ కేసీఆర్ ఘనంగా చెప్పుకున్న ఈ ప్రాజెక్టు.. కొద్ది నెలల్లోనే పేకమేడలా కూలిపోయిందని, దీనిపై విచారణ జరిపేందుకు సీబీఐకి అప్పగించినా కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తోందన్నారు. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ వాస్తవాలను జీర్ణించుకోలేక, అసెంబ్లీలో చర్చకు రాకుండా పారిపోతున్నారని మంత్రులు విమర్శించారు. శవాల మీద చిల్లర ఏరుకునే రీతిలో వ్యవహరించడం మానేసి, రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని ప్రతిపక్షాలకు హితవు పలికారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టులపై పూర్తిస్థాయి చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దమ్ముంటే చర్చకు రావాలని ప్రతిపక్షానికి సవాల్ విసిరారు.

పెయిడ్ ఆర్టిస్టులను వదిలి.. సభకు రండి: పొంగులేటి 

గత ఎన్నికల నుంచి వరుసగా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు పెరుగుతుండటాన్ని బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌ రెడ్డి విమర్శించారు. కేవలం రూ.38 వేల కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పక్కనపెట్టి, కమీషన్ల కోసమే రూ.లక్షా నలభై ఎనిమిది వేల కోట్లతో కాళేశ్వరాన్ని నిర్మించారని ఆరోపించారు. నాలుగేండ్లలో ఈ ప్రాజెక్టు ద్వారా కేవలం 162 టీఎంసీల నీటిని మాత్రమే ఎత్తిపోశారని, అందులో 50 టీఎంసీలు తిరిగి సముద్రంలోకే వదిలేశారన్నారు. ఈ ప్రాజెక్టు ఏనిమిదో వింత అని గొప్పలు చెప్పుకున్న ఆ పార్టీ నాయకులు.. వారి హయాంలోనే కుంగిపోవడం, లీకులు రావడం ప్రజలందరూ చూశారని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ఏటీఎం అని విమర్శించిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు సీబీఐ విచారణ ముందుకు సాగకుండా ఎందుకు ఆపుతుందో చెప్పాలని ప్రశ్నించారు. ప్రాజెక్టులపై చర్చకు రమ్మంటే అసెంబ్లీని బహిష్కరించి పారిపోతున్నారని, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కనీసం సభకు కూడా రావడం లేదన్నారు. సోషల్ మీడియాలో పెయిడ్ ఆర్టిస్టులతో విషం చిమ్మడం మానేసి, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టులపై జరిగే బహిరంగ చర్చలో పాల్గొనాలని ఆయన సవాల్ చేశారు. మీడియా సమావేశం అనంతరం జర్నలిస్టుల అంశంపై మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. రెండు దశాబ్దాలుగా పెండింగ్‌‌లో ఉన్న జవహర్‌‌లాల్‌‌ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్‌‌ సొసైటీ (జేఎన్‌‌జే) ఇండ్ల స్థలాల అంశంపై ‘వే అవుట్‌‌’కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌ రెడ్డి అన్నారు. జేఎన్‌‌జే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నట్లు తెలిపారు. జర్నలిస్టుల బాధలు ప్రభుత్వానికి తెలుసని పేర్కొన్నారు. పేదలకు కాంగ్రెస్‌‌ ఇందిరమ్మ ప్రభుత్వం పేటెంట్‌‌గా ఉందని, ఖమ్మం జిల్లా వెలుగుమెట్లలో పేద‌‌ల‌‌ ఇండ్లు కూల్చిన అంశంపై అర్హులైన పేదలకు ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇండ్లు కట్టి ఇస్తామని ఆయన తెలిపారు.

మానస పుత్రిక కుంగిపోతే సంబంధం లేదా?: పొన్నం

కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ మానస పుత్రిక అని, ఇంజనీరింగ్ అద్భుతమని గొప్పలు చెప్పుకున్న బీఆర్‌‌‌‌ఎస్‌‌ నేతలు.. ఇప్పుడు అది కుంగిపోతే తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఏటా 196 టీఎంసీలు ఎత్తిపోస్తామని చెప్పి, నాలుగేండ్లలో 162 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోశారన్నారు. ప్రాజెక్టుల పేరుతో కమీషన్ల కోసం కాలువలు తవ్వకుండానే భూసేకరణ చేసి, కాంట్రాక్టర్లకు అడ్వాన్సులు ఇచ్చి ఉత్తర తెలంగాణ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల భారాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మోస్తోందని, ఇప్పటికే రూ.73 వేల కోట్లు ప్రాజెక్టు కోసం చేసిన అప్పుల కింద చెల్లించిందని గుర్తుచేశారు.

కమీషన్లతోనే ధనిక పార్టీగా ఎదిగారు: వివేక్‌‌ వెంకటస్వామి

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన భారీ అవినీతిపై తాము గత 8 ఏండ్లుగా పోరాడుతూనే ఉన్నామని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. కేవలం రూ.27 వేల కోట్లు అదనంగా ఖర్చు చేసి ఉంటే తుమ్మిడిహట్టి నుంచి గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చే ప్రాజెక్టు పూర్తయ్యేదన్నారు. కానీ కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకే మేడిగడ్డ వద్ద కాళేశ్వరాన్ని నిర్మించారన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా దండుకున్న వేల కోట్ల రూపాయల కమీషన్లతోనే బీఆర్ఎస్ దేశంలో అత్యంత ధనిక ప్రాంతీయ పార్టీగా అవతరించిందని ఆరోపించారు. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో నిధులను మళ్లించారని ఆయన విమర్శించారు. రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు పెట్టినా.. రాష్ట్రానికి ఆశించిన స్థాయిలో నీరు రాలేదన్నారు. మల్లన్నసాగర్ లాంటి అనవసరమైన రిజర్వాయర్లను నిర్మించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌‌ రావు ఈ రాష్ట్రాన్ని దారుణంగా దోచుకున్నారని మండిపడ్డారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌ అవినీతిపై సీబీఐ విచారణ జరిపి, రాష్ట్రాన్ని లూటీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.