బీఆర్ఎస్ నుంచే పోటీ చేస్త.. బీఫామ్​ నాకే వస్తది: ఎమ్మెల్యే అబ్రహం

బీఆర్ఎస్ నుంచే పోటీ చేస్త.. బీఫామ్​ నాకే వస్తది: ఎమ్మెల్యే అబ్రహం

షీర్ బాగ్, వెలుగు: తాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచే పోటీ చేస్తానని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. నియోజకవర్గంలో మెజార్టీ నేతలు తన వెంటే ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. హైదరాబాద్​ గన్ పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు. బీఫామ్​ ఇవ్వడంలో కొంత ఆలస్యం అవుతుందని, విడతల వారీగా వస్తున్నాయని చెప్పారు. బీఫామ్​తనకే వస్తుందన్న విశ్వాసం ఉందన్నారు. ఇటీవల పార్టీలో చేరిన వారు ఎమ్మెల్యే కావాలనే ఉద్దేశంతో నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా సమావేశాలు పెడుతున్నారని, పార్టీకి నష్టం చేసేలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.

 కానీ, అధిష్టానం మద్దతు మాత్రం తనకే  ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా.. తనకు ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల పూర్తి నమ్మకం ఉందని వెల్లడించారు. అలంపూర్ లో గతంలో బీఆర్ఎస్ మూడో స్థానంలో ఉండేదని, ఇప్పుడు మొదటి ప్లేస్​కు వచ్చిందన్నారు.