మాదాపూర్, వెలుగు: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్‌షాపులను ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ హెచ్చరించారు. మాదాపూర్ గోకుల్ ప్లాట్స్‌లో అర్ధరాత్రి బెల్ట్‌షాపులపై స్వయంగా దాడి చేసి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. గోకుల్ ప్లాట్స్‌లో కొంతకాలంగా బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్నారు. అక్కడ మద్యం సేవించిన కొందరు తరచూ హంగామా సృష్టిస్తుండటంతో కాలనీవాసులు పలుమార్లు పోలీసులకు, ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు.
స్పందన లేకపోవడంతో ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సోమవారం అర్ధరాత్రి ఎమ్మెల్యే గాంధీ గోకుల్ ప్లాట్స్‌కు చేరుకుని బెల్ట్‌షాపులపై తనిఖీలు నిర్వహించారు. మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అక్కడికి చేరుకున్న మియాపూర్, ఎక్సైజ్ పోలీసులకు నిర్వాహకులను అప్పగించారు. ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు షాపుల నుంచి 35.25 లీటర్ల మద్యం, 63 లీటర్ల బీరు స్వాధీనం చేసుకున్నట్లు కొండాపూర్ ఎక్సైజ్ ఇన్‌చార్జి సీఐ ప్రవీణ్, ఎస్సై మొగులప్ప వెల్లడించారు.
