సీఎం దోపిడీని ఆధారాలతో బయటపెట్టాం :  హరీశ్ రావు

సీఎం దోపిడీని ఆధారాలతో బయటపెట్టాం :  హరీశ్ రావు
  • మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్​ రావు
  • సృజన్ రెడ్డి సిండికేట్ బద్ధలైందని కామెంట్

హైదరాబాద్, వెలుగు: సింగరేణి ఓవర్ బర్డెన్ (ఓబీ) టెండర్లలో రేవంత్ రెడ్డి సర్కార్ సాగిస్తున్న దోపిడీని ఆధారాలతో సహా బట్టబయలు చేశామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. బీఆర్ఎస్ అడుగడుగునా నిలదీయడంతోనే.. శ్రీరాంపూర్ ఓసీ 2 టెండర్ ఫైనాన్షియల్ బిడ్ల అసలు బాగోతం బయటపడిందని, టెక్నికల్ బిడ్ అయిన తర్వాత కూడా ఫైనాన్షియల్ బిడ్‌ను దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏడుసార్లు ఎందుకు వాయిదా వేశారని ప్రశ్నించామని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఆ నిరంతర ఒత్తిడికి తలొగ్గి, ఎట్టకేలకు సిండికేట్ ప్రమేయం లేకుండా పారదర్శకంగా బిడ్లు తెరిచేసరికి.. ఈ టెండర్ ఏకంగా మైనస్ 12 శాతానికి క్లోజ్ అయిందని చెప్పారు. ఇది బీఆర్ఎస్​ విజయమని తెలిపారు. కొత్త నిబంధనలు తెచ్చాక సింగరేణిలో నమోదైన తొలి నెగెటివ్ బిడ్ ఇదేనని, సీఎం బావమరిది సృజన్ రెడ్డి సిండికేట్‌ను బద్దలు కొడితే అసలైన పోటీ ఎలా ఉంటుందో, ధరలు ఎలా దిగి వస్తాయో ఈ ఒక్క టెండర్ నిరూపించిందని పేర్కొన్నారు. ‘‘గతంలో సింగరేణిలో ఓబీ టెండర్లు పారదర్శకంగా ఆన్‌లైన్‌లో జరిగేవి.

అప్పట్లో –7% నుంచి –20% తక్కువకే పనులు పూర్తయ్యి, సంస్థకు వందలాది కోట్లు ఆదా అయ్యేవి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే, సీఎం రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి కనుసన్నల్లో ఈ దోపిడీకి స్కెచ్ గీశారు. ఆన్‌లైన్ టెండర్ల పారదర్శకతను దెబ్బతీయడానికే కావాలని ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ నిబంధన తెచ్చారు. టెండర్ వేయకముందే అధికారుల దగ్గర ఈ సర్టిఫికెట్ తీసుకోవాలనే నిబంధన పెట్టడం వెనుక ఉన్న కుట్ర ఏంటంటే.. ఎవరెవరు టెండర్ వేస్తున్నారో అధికార పార్టీ నేతలకు ముందుగానే తెలిసిపోతుంది.

వాళ్లని బెదిరించి, పోటీ లేకుండా చేసి, తమకు కావాల్సిన వారికే టెండర్లు దక్కేలా సిండికేట్ ఏర్పాటు చేయడానికి ఇది బ్రహ్మాస్త్రంగా మారింది. ఈ సిండికేట్ దందా కేవలం టెండర్లకే పరిమితం కాలేదు, రాష్ట్ర విద్యుత్ వ్యవస్థను, సామాన్యుడి జేబును కూడా గుల్ల చేస్తోంది. ఈ కమీషన్ల కక్కుర్తి వల్ల ఓబీ పనుల్లో తీవ్ర జాప్యం జరిగి సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి పడిపోయింది. బొగ్గు లేక జెన్‌కో విద్యుత్ ఉత్పత్తి తగ్గించి, అనివార్యంగా బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కరెంటు కొనుగోలు చేయాల్సి వస్తోంది’’ అని ఆయన వెల్లడించారు.